Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 115

115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
    నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
    ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
    వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
    వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
    వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
    వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.

ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
    యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
    యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
    యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.

12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
    యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
    యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
    యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.

14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15     యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
    ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
    కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
    కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
    మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!

యెహోవాను స్తుతించండి!

సంఖ్యాకాండము 8:5-22

లేవీయులను ప్రతిష్టించటం

మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులలో ఇతరులనుండి లేవీ ప్రజలను వేరు చేయి. ఆ లేవీ మనుష్యులను శుద్ధి చేయి. వారిని శుద్ధి చేసెందుకు నీవు చేయాల్సింది ఇదే. పాప పరిహారార్థ అర్పణనుండి ప్రత్యేక జలాన్ని వారిమీద చల్లాలి. ఈ జలం వారిని శుద్ధి చేస్తుంది. అప్పుడు వారు శరీరం అంతటా క్షవరం చేసుకొని, వారి బట్టలు ఉదుకు కోవాలి. ఇది వారి శరీరాలను పవిత్రం చేస్తుంది.

“అప్పుడు వారు ఒక కోడెదూడను, దానికి సంబంధించిన ధాన్యార్పణను తీసుకోవాలి. ఈ ధాన్యార్ఫణ నూనెతో కలుపబడ్డ గోధుమపిండి. అప్పుడు పాపపరిహారార్థ బలిగా ఇంకో కోడెదూడను తీసుకోవాలి. లేవీ ప్రజలను సన్నిధి గుడారం ఎదుటి భాగంలోనికి తీసుకురావాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చుట్టూరా సమావేశపర్చాలి. 10 అప్పుడు నీవు లేవీ ప్రజలను యెహోవా ఎదుటికి తీసుకురావాలి. ఇశ్రాయేలు ప్రజలు వారిమీద తమ చేతులు ఉంచుతారు. 11 అప్పుడు అహరోను లేవీ మనుష్యులను యెహోవా ఎదుట కనపరుస్తాడు. వారు దేవునికి ఒక అర్పణవలె ఉంటారు. ఈ విధంగా యెహోవాకు ప్రత్యేక పని చేసేందుకు లేవీ ప్రజలు సిద్ధంగా ఉంటారు.

12 “లేవీ మనుష్యులు కోడెదూడ తలలమీద చేతులు ఉంచాలని వారితో చెప్పు. ఒక కోడెదూడ పాపపరిహారార్థ బలిగాను మరొక కోడెదూడ దహన బలిగాను యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలు లేవీ ప్రజల పాపాలను కప్పిపుచ్చుతాయి. 13 అహరోను, అతని కుమారుల ఎదుట నిలబడమని లేవీ మనుష్యులతో చెప్పు. అప్పుడు ఒక ప్రతిష్ఠ అర్పణగా లేవీ మనుష్యులను యెహోవాకు అర్పించు. 14 ఈ విధంగా లేవీ మనుష్యులు ప్రత్యేకం అవుతారు. ఇశ్రాయేలీయులలో ఇతరులకు వీరు వేరుగా ఉంటారు. లేవీ ప్రజలు నావారై ఉంటారు.

15 “కనుక లేవీ మనుష్యులను పవిత్రం చేయి. ప్రతిష్ఠార్పణగా వారిని యెహోవాకు అర్పించు. ఇలా చేసిన తర్వాత వారు సన్నిధి గుడారంలోనికి వచ్చి వారి పని చేయవచ్చును. 16 ఈ లేవీయులు నాకు ఇవ్వబడిన ఇశ్రాయేలు ప్రజలు. వారిని నా స్వంత ప్రజలుగా నేను స్వీకరించాను. గతంలో ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబంలో ప్రతి పెద్ద కుమారుడు నాకు ప్రతిష్ఠించబడ్డాడు. అయితే ఇశ్రాయేలుల్లో ఇతరుల జ్యేష్ఠ కుమారుల బదులు లేవీయులు మనుష్యులను నేను స్వీకరించాను. 17 ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబములో మొదట పుట్టిన ప్రతి మగ శిశువు నావాడే. అది మనిషిగాని పశువుగాని నాకే. ఎందుకంటే ఈజిప్టులో మొదట పుట్టిన పిల్లలను, జంతువులనుగూడ నేను చంపేసాను, కనుక మొదట పుట్టినవారు నావారై ఉండాలని పెద్ద కుమారులను మీ నుండి వేరు చేసాను. 18 ఇప్పుడు నేను లేవీ మనుష్యులను తీసుకున్నాను. ఇశ్రాయేలు కుటుంబాల్లో మొదటగా పుట్టిన కుమారులందరి స్థానంలో నేను వీరిని తీసుకున్నాను. 19 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ మనష్యులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను వారిని అహరోనుకు అతని కుమారులకు కానుకలుగా ఇచ్చాను. సన్నిధి గుడారం దగ్గర వారు పని చేయాలని నేను కోరుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరి పక్షంగా వారు సేవ చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల పాపాలను కప్పిపుచ్చే బలులు అర్పించుటలో వారు సహాయం చేస్తారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పవిత్ర స్థలాన్ని సమీపించినా ఏ గొప్ప రోగంగాని, కష్టంగాని వారికి కలుగదు.”

20 కనుక మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవాకు విధేయులయ్యారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన దానిని లేవీ మనుష్యులకు వారు జరిగించారు. 21 లేవీ ప్రజలు పవిత్రులయ్యారు. వారు వారిని శుద్ధి చేసుకున్నారు, వారి వస్త్రాలు ఉదుకు కొన్నారు. అప్పుడు అహరోను వారిని యెహోవా ఎదుట ప్రతిష్టార్పణగా అర్పించాడు. వారి పాపాలను క్షమించే అర్పణలను కూడా అర్పించి, అహరోను వారిను పవిత్రం చేసాడు. 22 ఆ తర్వాత లేవీ మనుష్యులు వారి పని చేసుకొనేందుకు సన్నిధి గుడారానికి వచ్చారు. అహరోను, అతని కుమారులు వారిని పర్యవేక్షించారు. లేవీ ప్రజల పనికి వారు బాధ్యులు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞకు అహరోను, అతని కుమారులు విధేయులయ్యారు.

తీతుకు 1:1-9

దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.

మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!

క్రేతులో తీతు చేయవలసిన పని

అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International