Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 138

దావీదు కీర్తన.

138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
    దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
    నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
    నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.

యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
    నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా మహిమ గొప్పది.
దేవుడు గొప్పవాడు.
    అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
    కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
    నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
    యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.

1 సమూయేలు 6:1-18

దేవుని పవిత్ర పెట్టె యధా స్థానానికి పంపబడుట

దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు. ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాలో మాకు చెప్పండి” అని అడిగారు.

“మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.

“తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు.

“ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో. ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.

“మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు.[a] యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి. బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.

10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశారు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు. 11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతిరూపాలను ఆ బండిమీద పెట్టారు. 12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.

13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి. 14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.

15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను క్రిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.

16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.

17 ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహారంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిష్తీయుల పట్టణాలయిన అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులనుండి పంపారు. 18 ఫిలిష్తీయులు ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను పంపారు ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు ప్రాకారాలతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటిక్రింద ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి.

ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి యెహోషువ పొలంలో ఈనాటికీ సాక్షిగావుంది.

లూకా 8:4-15

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మత్తయి 13:1-17; మార్కు 4:1-12)

అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు:

“ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.”

ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.

శిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” ఆయన్ని అడిగారు.

10 యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే,

‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి
    చూడలేరు,
వాళ్ళు వింటున్నదానిని
    అర్థం చేసుకోలేరు.’(A)

యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం

(మత్తయి 13:18-23; మార్కు 4:13-20)

11 “ఇందులోని అర్థం యిది: విత్తనం దైవ సందేశం. 12 దారిపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ప్రజలు వింటారు. కాని సైతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్న దైవ సందేశాన్ని తీసుకువెళ్తాడు. వీళ్ళు విశ్వసించరాదని, రక్షింపబడరాదని వాని ఉద్దేశ్యం. 13 రాతి నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది; కొందరు దైవ సందేశం విని దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కాని వీళ్ళ విశ్వాసానికి వేర్లు ఉండవు. కనుక వాళ్ళు కొద్ది కాలం మాత్రమే విశ్వసిస్తారు. పరీక్షా సమయం రాగానే వెనుకంజ వేస్తారు.

14 “ముళ్ళు పెరిగే నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు వింటారు కాని సుఖదుఃఖాలు, ధనము వాళ్ళను అణచి వేయటం వల్ల వాళ్ళు సంపూర్ణంగా ఫలించరు. 15 సారవంతమైన నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ఉత్తమమైన మంచి మనస్సుతో విని, విన్న వాటిని హృదయాల్లో దాచుకొని పట్టుదలతో మంచి ఫలాన్నిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International