Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.
యోనాతాను ఫిలిష్తీయులపై పడటం
14 సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.
2 మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు. 3 వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.
4 కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండలున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ పేరు సెనే. 5 ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.
6 యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.
7 “మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.
8 “అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము. 9 వాళ్లు గనుక మనల్ని చూసి ‘తాము వచ్చే వరకూ ఆగండని’ అంటే, మనము అప్పుడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. వారి వద్దకు పోవద్దు. 10 కానీ ‘మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.
11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు. 12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు.
అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.
13-14 అప్పుడు యోనాతాను తన కాళ్లు, చేతులతో మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అనుసరించాడు. యోనాతాను మరియు అతని సహాయకుడు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారు. మొదటి వధయందు వారు ఇరవై మంది ఫిలిష్తీయులను అర ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదురుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మోసేవాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని చంపేసాడు.
15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.
16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు. 17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు.
వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.
18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది). 19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు క్రిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.
20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు. 21 గతంలో వారి క్రింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు. 22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.
23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.
చివరి మాట
11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి. 12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.
14 యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము. 15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం. 16 ఈ నియమాల్ని పాటించేవాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.
17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి.
18 సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.
© 1997 Bible League International