Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:113-128

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

1 సమూయేలు 18:6-30

దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు.

“సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు
    దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు”

స్త్రీలంతా జయగీతిక పాడారు.

స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబుతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు. అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు.

సౌలు దావీదును గూర్చి భయపడుట

10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది. 11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలంచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.

12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీదు అంటే సౌలుకు భయంవేసింది. 13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు. 14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు. 15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది. 16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.

దావీదు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సౌలు కోరుట

17 (కానీ సౌలు దావీదును చంపాలని కోరాడు. దావీదును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైనికుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్ధాలు చేయి” అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నాగము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్తీయులే అతనిని చంపుతారులే” అని తలంచాడు.

18 అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబంకాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి అమ్మాయిని పెళ్లాడలేను” అని అన్నాడు.

19 అందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే సమయం వచ్చేసరికి, సౌలు ఆమెను మెహోలతీవాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు.

20 సౌలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. మీకాలు దావీదును ప్రేమించినట్టు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతోషించాడు. 21 “మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.

22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం. అతని అధికారులకు కూడా నీవంటే ఇష్టం. నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.

23 సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుొటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.

24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు. 25 మళ్లీ సౌలు వారితో, “దావీదు కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి. దానితో సౌలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలిష్తీయులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం.

26 సౌలు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం చెప్పారు. దావీదు సౌలు అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. కనుక అతడు వెంటనే పనికి పూనుకున్నాడు. 27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకొని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు.

అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు. 28 అప్పుడు కూడా యెహోవా దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమస్తూ ఉందని తెలుసుకున్నాడు. 29 దానితో సౌలుకు దావీదు అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు.

30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు క్రిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.

అపొస్తలుల కార్యములు 27:13-38

తుఫాను

13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.

18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.

21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.

27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[a] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.

33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International