Revised Common Lectionary (Semicontinuous)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
ప్రథమ కుటుంబం
4 ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను[a] అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.
2 ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.
ప్రథమ హత్య
3-4 కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు.
హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. 5 అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. 6 యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? 7 నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును[b] అదుపులో పెట్టాలి.”
8 “మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు.
9 తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?”
అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు.
10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. 11 (నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”
13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! 14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”
15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.
కయీను కుటుంబం
16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.
యేసు గొప్ప ప్రధాన యాజకుడు
14 పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా ఉండాలి. 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 16 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, అనుగ్రహము మనకు లభిస్తాయి.
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
© 1997 Bible League International