Revised Common Lectionary (Semicontinuous)
బేత్
9 యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
నీ మాటలు నేను మరచిపోను.
జ్ఞానం చెప్పేది వినండి
2 నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. 2 జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు. 3 జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు. 4 వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు. 5 వీటిని నీవు చేస్తే అప్పుడు నీవు యెహోవాను గౌరవించటం నేర్చుకొంటావు. నీవు నిజంగా దేవుణ్ణి గూర్చి నేర్చుకొంటావు.
6 యెహోవా జ్ఞానము ప్రసాదిస్తాడు. జ్ఞానము, అవగాహన ఆయన నోటి నుండి వస్తాయి. 7 ఆయన నిజాయితీ పరులకు మంచి జ్ఞానం దాచి సమకూర్చి ఇస్తాడు. ఆయన నిజాయితీగా నడుచుకొనేవారికి కవచం లాంటివాడు. 8 ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.
9 కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు. 10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది.
11 జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది. 12 దుర్మార్గులు జీవించే చెడు మార్గంలో జీవించకుండ జ్ఞానము, వివేచన మిమ్మల్ని వారిస్తాయి. ఆ మనుష్యులు వారు చెప్పే వాటిలో కూడా దుర్మార్గులు 13 వారు మంచితనం విడిచి పెట్టి, ఇప్పుడు చీకట్లో (పాపంలో) జీవిస్తున్నారు. 14 వారు తప్పుచేసి సంతోషిస్తూ, దుర్మార్గపు చెడు మార్గాలలో ఆనందిస్తున్నారు. 15 ఆ మనుష్యులు నమ్మదగిన వారు కారు, వారు అబద్ధాలాడి మోసం చేస్తారు. కాని మీ జ్ఞానం, వివేచన వాటన్నిటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి.
విడాకులను గురించి బోధించటం
(మార్కు 10:1-12)
19 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. 2 ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.
3 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.
4-5 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’(A) ఇది మీరు చదువలేదా? 6 ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.
7 “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.
8 యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. 9 కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.
10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.
11-12 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International