Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 2

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

నిర్గమకాండము 19:9-25

“దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.

అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.

10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని 11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 12-13 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.

14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.

15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.

16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.

20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు. 22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.

23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.

24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.

25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.

హెబ్రీయులకు 11:23-28

23 మోషే తల్లి తండ్రులకు దేవుని పట్ల విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు సాధారణమైన శిశువు కాడని గ్రహించగలిగారు. తద్వారా వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు నెలల దాకా దాచివుంచారు.

24 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. 25 పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటానికన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించటానికి అతడు సిద్ధమయ్యాడు. 26 అతడు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం భరించటం ఉత్తమమని భావించాడు.

27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International