Revised Common Lectionary (Semicontinuous)
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
సోమరిగా ఉండుటవల్ల అపాయాలు
6 సోమరీ, నీవు చీమల దగ్గరకు వెళ్లి చీమలు ఏమి చేస్తుంటాయో చూడు. చీమ దగ్గర నేర్చుకో. 7 చీమకు పాలకుడు, అధికారి, నాయకుడు అంటూ ఎవరూలేరు. 8 కాని చీమ, దాని ఆహారాన్ని వేసవిలో కూర్చుకొంటుంది. చీమ, దాని ఆహారాన్ని దాచుకొంటుంది. చలికాలంలో దానికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది.
9 సోమరీ, ఇంకెంతనేపు నీవు అక్కడ పండుకొంటావు. నీ విశ్రాంతి నుండి నీవు యింకెప్పుడు లేస్తావు? 10 “నాకు ఇంకొంచెం నిద్ర కావాలి. యింకాకొంచెంసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను” అని సోమరి చెబుతాడు. 11 కాని అతడు నిద్రపోతాడు, మళ్లీ నిద్రపోతాడు; అతడు అతి దరిద్రుడవుతాడు. త్వరలోనే అతనికి ఏమీ ఉండదు. ఒక దొంగవాడు వచ్చి సమస్తం దోచుకున్నట్టు ఉంటుంది.
సమస్య కారకులు
12 దుర్మార్గుడు, పనికిమాలినవాడు అబద్ధాలు చెబుతాడు. చెడ్డ సంగతులే చెబుతాడు. 13 అతడు కన్నుగీటి, సూచనలు చేసి మనుష్యులను మోసం చేస్తాడు. 14 ఆ మనిషి దుర్మార్గుడు. ఎంతసేపూ అతడు దుర్మార్గపు పథకాలే వేస్తాడు. అన్నిచోట్లా అతడు చిక్కులు పెడుతుంటాడు. 15 కాని అతడు శిక్షించబడతాడు. కష్టం అతనికి అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అతడు త్వరగా నాశనం చేయబడతాడు. అతనికి ఎవరూ సహాయం చేయరు.
యెహోవా అసహ్యించుకొనే ఏడు సంగతులు
16 ఈ ఆరు విషయాలను యెహోవా అసహ్యించుకొంటాడు: కాదు ఏడును ఆయన అసహ్యించుకొంటాడు.
17 ఇతరులకంటే తానే మంచివాడు అనుకొనే మనిషి. అబద్దాలు చెప్పే మనిషి. నిర్దోషులను చంపే మనిషి.
18 చెడ్డపనులు చేయాలని త్వరపడే మనిషి. దుర్మార్గం చేయాలని కోరే మనిషి.
19 అబద్ధం వెంబడి అబద్ధం చెప్పే మనిషి. వాదాలకు పూనుకొని ప్రజల మధ్య కలహాలు పెట్టే మనిషి.
వ్యభిచారముకు విరోధంగా హెచ్చరిక
20 నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో. మరియు నీ తల్లి ఉపదేశాలు మరువకు. 21 వారి మాటలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. వారి ఉపదేశములను నీ జీవితంలో ఒక భాగంగా చేసుకో. 22 నీవు ఎక్కడికి వెళ్లినా వారి ఉపదేశములు నీకు దారి చూపిస్తాయి. నీవు నిద్రపోయినప్పుడు అవి నిన్ను కనిపెట్టుకొని ఉంటాయి. మరియు నీవు మేల్కొన్నప్పుడు అవి నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తాయి.
23 నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు, ఉపదేశములు నీకు సరైన దారి చూపించే వెలుగులా ఉంటాయి. నీవు జీవమార్గాన్ని వెంబడించేందుకు నిన్ను అవి సరిదిద్ది, నీకు శిక్షణ ఇస్తాయి.
యేసు ఈ ప్రపంచానికి వెలుగు
12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.
13 పరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.
14 యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. 16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. 17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు. 18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.
19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు.
యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు. 20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!
కొందరు యూదులు యేసును అపార్థము చేసికొనటం
21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.
22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.
23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. 24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.
25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు.
యేసు, “నేను యింతవరకు ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు. 26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.
27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. 28 అందువలన యేసు వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. 29 నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు. 30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.
© 1997 Bible League International