Revised Common Lectionary (Semicontinuous)
15 “జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. 16 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 17 అయితే మీరు యెహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే 18 మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయొర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు.
19 “ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. 20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”
ఆలెఫ్[a]
119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
2 యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
వారు యెహోవాకు విధేయులవుతారు.
4 యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
6 అప్పుడు నేను నీ ఆజ్ఞలను
ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
7 అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!
మానవులను అనుసరించుట తప్పు
3 సోదరులారా! ఆత్మీయత కలవాళ్ళతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. ఆత్మీయత లేనివాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్నల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను. 2 మీరు అన్నం తినటానికి సిద్ధంగా లేరు. కనుక పాలు యిచ్చాను. మీరు ఇప్పటికీ సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత లేనివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. 3 మీలో అసూయలు, పోట్లాటలు ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేనివాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! 4 మీలో ఒకడు, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. అలా మామూలు మనుష్యులు అంటారు.
5 ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. 6 నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళు పోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే. 7 విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు. 8 విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్దేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీ ఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది. 9 ఎందుకంటే, మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం.
మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు.
హత్య చెయ్యరాదు
21 “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.
23-24 “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి.
25 “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. 26 ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.
వ్యభిచారం చేయరాదు
27 “‘వ్యభిచారం చేయరాదు’(A) అని చెప్పటం మీరు విన్నారు. 28 కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. 29 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. 30 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది.
విడాకులను గురించి బోధించటం
(మత్తయి 19:9; మార్కు 10:11-12; లూకా 16:18)
31 “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’(B) అని చెప్పే వాళ్ళు. 32 కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు.
ప్రమాణాలు
33 “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 34 కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. 35 భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. 36 మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. 37 మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే.
© 1997 Bible League International