Revised Common Lectionary (Semicontinuous)
112 యెహోవాను స్తుతించండి.
యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9 ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
యెరూషలేమును దేవుడు శక్షిస్తాడు
29 దేవుడు చెబుతున్నాడు, “అరీయేలును చూడండి! అరీయేలు, దావీదు మజిలీ చేసిన పట్టణం. దాని పండుగలు సంవత్సరం సంవత్సరం కొనసాగుతున్నాయి. 2 అరీయేలును నేను శిక్షించాను ఆ పట్టణం దుఃఖంతో, ఏడ్పుతో నిండిపోయింది. కానీ అది ఎప్పటికీ నా అరీయేలే.
3 “నీ చుట్టూ సైన్యాలను ఉంచాను అరీయేలూ. నీకు విరోధంగా నేను యుద్ధగోపురాలను లేపాను. 4 నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడు ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలలోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.”
5 అక్కడ చాలామంది క్రొత్తవాళ్లు దుమ్ముకణాల్లా ఉన్నారు. గాలికి ఎగిరే పొట్టులాంటి క్రూరమైన మనుష్యులు చాలామంది అక్కడ ఉన్నారు. 6 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, భూకంపాలు, మహా గొప్ప శబ్దాలు ప్రయోగించి యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన గాలులు, కాల్చివేసే అగ్ని ఉపయోగించి యెహోవా నాశనం చేశాడు. 7 అరీయేలు మీద ఎన్నెన్నో దేశాలు యుద్ధం చేశాయి. అది రాత్రి వేళ కలిగే భయంకరపీడ కలలాంటిది. అరీయేలు చుట్టూ సైన్యాలు వచ్చేసి దానిని శిక్షించాయి. 8 కానీ ఆ సైన్యాలకు కూడ అది ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవసరమైనవి దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కలవచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కోంటాడు, దాహంతోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యాలన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు కావాలనుకొన్నవి దొరకవు.
9 ఆశ్చర్యపడండి, విస్మయం చెందండి!
మీరు మత్తులవుతారు కాని ద్రాక్షరసంతో కాదు,
చూచి ఆశ్చర్యపడండి!
మీరు తూలి, పడతారు కానీ మద్యంతో కాదు.
10 యెహోవా మిమ్మల్ని నిద్రబుచ్చుతాడు
యెహోవా మీ కళ్లు మూస్తాడు (ప్రవక్తలే మీ కళ్లు)
యెహోవా మీ తలలు కప్పుతాడు (ప్రవక్తలే మీ తలలు.)
11 ఈ సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు గ్రహించరు అని నేను మీతో చెబుతున్నాను. మూసివేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాటల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు వుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు. 12 లేకపోతే చదవటం రానివాడికి మీరు ఆ పుస్తకం ఇచ్చి, వాడిని చదవమని చెప్పండి. ఆ వ్యక్తి, “నాకు చదవటం రాదు గనుక నేను చదవలేను” అంటాడు.
తెలివిగల వాళ్ళు
13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.
© 1997 Bible League International