Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 30-31

యాకె కుమారుడు ఆగూరు జ్ఞాన సూక్తులు

30 యాకె కుమారుడు ఆగూరు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి: అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు ఇచ్చిన సందేశం:

భూమి మీద నేను అతి దౌర్భాగ్యుడను. నేను గ్రహించాల్సిన విధంగా గ్రహించటంలేదు. జ్ఞానము కలిగి ఉండటం నేను నేర్చుకోలేదు. మరియు దేవుని గురించి నాకు ఏమీ తెలియదు. ఏ మనిషీ ఎన్నడూ పరలోకంలోని సంగతులను గూర్చి నేర్చుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ గాలిని తన చేతిలో పట్టుకోలేదు. ఏ మనిషీ ఎన్నడూ నీటిని ఒక గుడ్డ ముక్కలో పట్టుకోలేడు. ఏ మనిషీ ఎన్నడూ భూమి హద్దులను నిజంగా తెలిసికోలేడు. ఈ సంగతులను తెలిసికో గలిగిన మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఎవరు? అతని కుటుంబం ఎక్కడ ఉంది?

దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.

యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నన్ను మరీ ధనికునిగా లేక మరీ దరిద్రునిగా చేయవద్దు. ప్రతిరోజూ నాకు అవసరమైన వాటిని మాత్రమే అనుగ్రహించు. నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.

10 ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే ఆ యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.

11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు.

12 కొందరు చాలా మంచివాళ్లం అనుకొంటారుగాని వారు చాలా చెడ్డవాళ్లు.

13 కొంతమంది చాలా మంచివాళ్లం అనుకొంటారు. వారు యితరులకంటే చాలా మంచివాళ్లు అనుకొంటారు.

14 ఖడ్గాల్లాంటి పళ్లు ఉన్నవారు కొందరు ఉంటారు. వారి దవడలు కత్తుల్లా ఉంటాయి. వారు పేద ప్రజలనుండి సమస్తం దోచుకోవటానికి వారి సమయం అంతా ఉపయోగిస్తారు.

15 కొంతమంది వారికి చేతనైనంత మట్టుకు అంతా తీసికోవాలి అనుకొంటారు. “నాకివ్వు, నాకివ్వు, నాకివ్వు” అనటం మాత్రమే వారు చెప్పేది అంతాను. ఎన్నటికీ తృప్తిపడనివి మూడు ఉన్నాయి వాస్తవానికీ సరిపడినంతగా ఎన్నడూ లేనివి నాలుగు ఉన్నాయి. 16 చావు స్థలం, పిల్లలు లేని స్త్రీ, వర్షం కావాల్సిన బీడుభూమి, వారించజాలని వేడి నిప్పు.

17 తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షిచబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.

18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి. 19 ఆకాశంలో ఎగిరే పక్షిరాజు, ఒక బండ మీద పాకుచున్న ఒక పాము, మహా సముద్రంలో తిరిగే ఓడ, ఒక స్త్రీతో ప్రేమలోవున్న మగవాడు.

20 తన భర్తకు నమ్మకంగా లేని ఒక భార్య తాను ఏమీ తప్పు చేయనట్టు నటిస్తుంది. ఆమె భోంచేస్తుంది, స్నానం చేస్తుంది, నేను ఏమీ తప్పు చేయలేదు అంటుంది.

21 భూమి మీద చిక్కు కలిగించేవి మూడు సంగతులు ఉన్నాయి. వాస్తవానికి భూమి భరించలేనివి నాలుగు ఉన్నాయి. 22 రాజైన ఒక సేవకుడు, తనకు కావాల్సినవి అన్నీ కలిగి ఉన్న ఒక బుద్ధిహీనుడు, 23 ద్వేషంతో పూర్తిగా నిండిపోయినా, ఒక భర్తను పొంద గలిగిన స్త్రీ, ఏ స్త్రీ దగ్గర సేవ చేస్తుందో, ఆ స్త్రీ మీద అధికారిణి అయిన దాసి.

24 భూమి మీద చిన్నవిగా ఉన్నవి నాలుగు ఉన్నాయి. అయితే ఇవి చాలా జ్ఞానము గలవి.

25 చీమలు చిన్నవి, బలహీనమైనవి. కాని అవి వేసవి కాలం అంతా ఆహారం నిల్వచేసుకొంటాయి.

26 కుందేలు చిన్న జంతువు. కాని అది బండల్లో నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతుంది.

27 మిడతలకు రాజు లేడు. కాని అవన్నీ కలిసికట్టుగా పని చేయగలుగుతున్నాయి.

28 బల్లులు నీవు చేతితో పట్టుకోగలిగినంత చిన్నవి. కాని అవి రాజుల గృహాలలో నివసించటం నీవు చూడ గలవు.

29 నడుస్తున్నప్పుడు ముఖ్యమైనవిగా కనుపించేవి మూడు ఉన్నాయి. నిజానికి నాలుగు ఉన్నాయి.

30 సింహం జంతువులలోకెల్ల చాలా బలమైనది. అది దేనికీ భయపడదు.

31 చాలా గర్వంగా నడిచే కోడి పుంజు,

ఒక మేక పోతు,

తన ప్రజల మధ్య ఉన్న రాజు.

32 నీవు తెలివితక్కువవాడవై యుండి ఇతరులకంటె నీవే మంచివాడవు అని తలిస్తే, మరియు నీవు దుర్మార్గాన్ని తల డితే, నీవు ఆగిపోయి, నీవు చేస్తున్నదాన్ని గూర్చి ఆలోచించాలి.

33 ఒక మనిషి పాలను చిలికితే వెన్న వస్తుంది. ఒకడు మరొకని ముక్కు మీద కొడితే, రక్తం వస్తుంది. అదే విధంగా నీవు ప్రజలకు కోపం పుట్టిస్తే నీవు చిక్కు కలిగిస్తావు.

లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు

31 లెమూయేలు రాజు చెప్పిన జ్ఞాన సూక్తులు ఇవి. ఈ విషయాలను అతని తల్లి అతనికి నేర్పించింది.

నీవు నా కుమారుడవు. నేను ప్రేమించే నా కుమారుడివి. నాకు కావాలని నేను ప్రార్థించిన కుమారుడివి నీవు. స్త్రీలకోసం నీ బలం వ్యర్థం చేయవద్దు. స్త్రీలే రాజులను నాశనం చేసేవాళ్లు. వారికోసం నిన్ను నీవు వ్యర్థం చేసుకోవద్దు. లెమూయేలూ, రాజులు ద్రాక్షారసం త్రాగటం జ్ఞానముగల పనికాదు. మద్యము కోరుట పరిపాలకులకు జ్ఞానముగల పనికాదు. వారు విపరీతంగా తాగేసి న్యాయచట్టం చెప్పేదానిని మరచి పోవచ్చు. అప్పుడు వారు పేద ప్రజల హక్కులు అన్నీ తీసివేస్తారు. మద్యం పేద ప్రజలకు ఇమ్ము. ద్రాక్షారసం కష్టంలో ఉన్న ప్రజలకు ఇమ్ము. అప్పుడు వారు అది తాగి, వారు పేదవాళ్లు అనే మాట మరచిపోతారు. వాళ్లు తాగేసి వారి కష్టాలన్నీ మరచిపోతారు.

ఒకడు తనకు తానే సహాయం చేసికోలేకపోతే అప్పుడు నీవు అతనికి సహాయం చేయాలి. కష్టంలో ఉన్న ప్రజలందరికీ నీవు సహాయం చేయాలి. సరైనవి అని నీకు తెలిసిన విషయాల కోసం నీవు నిలబడు. మనుష్యులందరికీ న్యాయంగా తీర్పు తీర్చు. పేద ప్రజల, నీ అవసరం ఉన్న ప్రజల హక్కులను కాపాడు.

పరిపూర్ణమైన భార్య

10 “పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం.
    కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం.
11 ఆమె భర్త ఆమెను నమ్మగలడు.
    అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు.
12 మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది.
    ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు.
13 ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ
    ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది.
14 ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది.
    అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది.
15 ఆమె అతి వేకువనే మేలుకొంటుంది.
    తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది.
16 ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది.
    ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది.
17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది.
    ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది.
18 ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది.
    మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది.
19 ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని
    తన స్వంత బట్ట నేస్తుంది.
20 ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది.
    అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది!
21 చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు.
    ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది.
22 ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది.
    సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది.
23 ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు.
    అతడు దేశ నాయకులలో ఒకడు.
24 ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి
    వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది.
25 ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు.
    ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది.
    భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది.
26 ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది.
    ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది.
27 ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు.
    కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది.
28 ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు.
    మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు.
29 “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు.
    కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు.
30 సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు.
    అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి.
31 ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి.
    ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International