Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సామెతలు 10-12

సొలొమోను జ్ఞానోక్తులు

10 ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు):

జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు: ఖం కలిగిస్తాడు.

ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.

యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు.

బద్ధకస్తుడు పేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు.

తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు.

మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుణ్ణి అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.

మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువబడును.

జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.

నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు.

10 సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు.

11 ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కాని ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి.

12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కాని మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.

13 జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కాని బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.

14 జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కాని బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.

15 ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది.

16 ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది. దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది.

17 తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు.

18 తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కాని బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు.

19 అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుటకు నేర్చుకొంటాడు.

20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కాని దుర్మార్గుని తలంపులు పనికిమాలినవిగా ఉంటాయి.

21 ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కాని బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తుంది.

22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.

23 బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కాని జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు.

24 దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కాని మంచివాడు తాను కోరుకొనే వాటిని పొందుతాడు.

25 సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుతారు. కాని మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు.

26 బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు.

27 నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బ్రతుకుతావు. కాని దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు.

28 మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.

29 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కాని తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు.

30 మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కాని దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు.

31 మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కాని కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు.

32 మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కాని దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.

11 వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు ఆ త్రాసులను ఉపయోగిస్తారు. ఆ తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కాని సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.

గర్వించి, గొప్పలు చెప్పుకొనే మనుష్యులు ఎన్నిక లేని వారవుతారు. కాని దీనులు జ్ఞానముగల వారవుతారు.

మంచి, నిజాయితీగల మనుష్యులు నిజాయితీ పంథాను అనుసరిస్తారు. కాని దుర్మార్గులు ఇతరులను మోసం చేసినప్పుడు వారిని వారే నాశనం చేసుకొంటారు.

దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చేనాడు, డబ్బుకి విలువ ఏమీ ఉండదు. కాని మంచితనం మనుష్యులను మరణం నుండి రక్షిస్తుంది.

ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కాని దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయబడతాడు.

నిజాయితీగల మనిషిని మంచితనం రక్షిస్తుంది. కాని దుర్మార్గులు వారు చేయాలనుకొన్న చెడు విషయాల ఉచ్చులో పట్టుబడతారు.

దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతనికి నిరీక్షణ ఏమీలేదు. అతడు ఆశించినది అంతా పోతుంది అదంతా మొత్తం ఏ విలువలేనిది అవుతుంది.

మంచి మనిషి కష్టాన్ని తప్పించుకొంటాడు. ఆ కష్టం మరొక దుర్మార్గునికి సంభవిస్తుంది.

ఒక దుర్మార్గుడు చెప్పే విషయాల మూలంగా అతడు ఇతరులను బాధించగలడు. కాని మంచి మనుష్యులు వారి జ్ఞానము చేత కాపాడబడుతారు.

10 మంచి మనుష్యులకు విజయం కలిగినప్పుడు పట్టణం అంతా సంతోషిస్తుంది. దుర్మార్గులు నాశనం చేయబడినప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.

11 నిజాయితీగల మనుష్యులు వారు నివసిస్తున్న పట్టణానికి తమ దీవెనలు ఇచ్చినప్పుడు, అది గొప్పది అవుతుంది. కాని ఒక దుర్మార్గుడు చెప్పే విషయాలు ఒక పట్టణాన్ని నాశనం చేయగలవు.

12 బుద్ధిహీనుడు ఇతరులను విమర్శిస్తాడు. అయితే జ్ఞానముగలవానికి ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు.

13 ఇతరులను గూర్చి రహస్యాలు చెప్పే వారెవరూ నమ్మదగినవారు కారు. కాని నమ్మదగిన మనిషి చెప్పుడు మాటలను వ్యాపింపచేయడు.

14 ఒక దేశానికి సమర్ధత లేని నాయకులు ఉంటే, ఆ దేశం పతనం అవుతుంది. అయితే అనేకమంది మంచి సలహాదారులు ఆ దేశాన్ని క్షేమంగా ఉంచుతారు.

15 ఇంకో మనిషి బాకీ నీవు చెల్లిస్తానని వాగ్దానం చేస్తే, అప్పుడు నీవు విచారిస్తావు. అలాంటి వ్యవహారాలను నీవు తిరస్కరిస్తే నీవు క్షేమంగా ఉంటావు.

16 దయగల, మర్యాదస్థురాలు గౌరవం సంపాదిస్తుంది. చొచ్చుకుపోయే పురుషులు ధనం మాత్రమే సంపాదిస్తారు.

17 దయగల మనిషి లాభం పొందుతాడు. కాని నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు.

18 దుర్మార్గుడు మనుష్యులను మోసం చేసి, వారి డబ్బు తీసుకొంటాడు. అయితే న్యాయంగా ఉండి, సరైనది చేసేవాడు నిజమైన బహుమానం పొందుతాడు.

19 నిజంగా, మంచితనం జీవాన్ని తెచ్చిపెడ్తుంది. కాని దుర్మార్గులు దుర్మార్గాన్ని వెంటాడి, మరణం తెచ్చుకొంటారు.

20 దుర్మార్గం చేయటానికి ఇష్టపడే వాళ్లు యెహోవాకు అసహ్యం. అయితే మంచిని చేసేందుకు ప్రయత్నించే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.

21 దుర్మార్గులు నిశ్చయంగా శిక్షించబడతారు అనేది సత్యం. మంచివాళ్లు స్వతంత్రులుగా చేయబడతారు.

22 ఒక స్త్రీ అందంగా ఉండి, అవివేకంగా ఉంటే అది అందమైన బంగారు ఉంగరం పంది ముక్కుకు ఉన్నట్టే ఉంటుంది.

23 మంచి మనుష్యులకు వారు కోరింది లభించినప్పుడు దాని అంతం ఎల్లప్పుడూ మంచిదిగానే ఉంటుంది. కాని దుర్మార్గులకు వారు కోరింది లభించినప్పుడు, చివరికి అది చిక్కుగానే ఉంటుంది.

24 ఒక మనిషి ధారాళంగా ఇస్తే, అప్పుడు అతనికి అంతకంటే ఎక్కువ లభిస్తుంది. కాని ఒకడు ఇచ్చేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు దరిద్రుడు అవుతాడు.

25 ధారాళంగా ఇచ్చే మనిషి లాభం పొందుతాడు. నీవు యితరులకు సహాయం చేస్తే, అప్పుడు నీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది.[a]

26 తన ధాన్యం అమ్మేందుకు నిరాకరించే దురాశగల మనిషి మీద ప్రజలు కోపగిస్తారు. అయితే ఇతరులకు ఆహారం పెట్టేందుకు తన ధాన్యం అమ్మేవాని విషయంలో ప్రజలు సంతోషిస్తారు.

27 మంచిని చేయుటకు ప్రయత్నించే మనిషిని ప్రజలు గౌరవిస్తారు. కాని దుర్మార్గం చేసే మనిషికి కష్టం మాత్రమే వస్తుంది.

28 తన ఐశ్వర్యాలను నమ్ముకొనే మనిషి పడిపోతాడు. కాని, మంచి మనిషి పచ్చటి చిగురాకులా పెరుగుతాడు.

29 ఒక మనిషి గనుక తన కుటుంబానికి కష్టం కలిగిస్తే అతనికి లాభం ఏమీ కలుగదు. చివరికి బుద్ధిహీనుడు జ్ఞానముగల మనిషికి సేవ చేయుటకు బలవంతం చేయబడతాడు.

30 మంచి మనిషి చేసే విషయాలు జీవవృక్షంలా ఉంటాయి. ఒక జ్ఞానముగల మనిషి ప్రజలకు కొత్త జీవితం ఇస్తాడు.

31 మంచి మనుష్యులకు భూమి మీద ప్రతిఫలం ఇవ్వబడితే, నిశ్చయంగా దుర్మార్గులు, పాపులు వారికి తగిన దానిని పొందుతారు.

12 ఒక మనిషి జ్ఞానము కలిగి ఉండాలి అనుకొంటే, అతడు తప్పు చేసినప్పుడు దానిని ఎవరైనా అతనికి చెప్పగా అతనికి కోపంరాదు. తాను చేసింది తప్పు అని ఎవరైనా తనకు చెప్పటం ఇష్టంలేని మనిషి మూర్ఖుడు.

మంచి మనిషి విషయం యెహోవా సంతోషిస్తాడు. కాని దుర్మార్గుణ్ణి దోషిగా యెహోవా తీర్పుర్చు చెబుతాడు.

దుర్మార్గపు మనిషి ఎన్నడూ క్షేమంగా ఉండడు. అయితే మంచి మనుష్యులు సురక్షితంగా ఉండగలరు.

మంచి భార్య విషయమై భర్త సంతోషించి అతిశయిస్తాడు. కాని ఒక స్త్రీ తన భర్తను అవమానిస్తే, అప్పుడు ఆమె అతని శరీరంలో ఒక వ్యాధిలా ఉంటుంది.

మంచి మనుష్యులు తాము చేయాలని తలపెట్టే విషయాల్లో నిజాయితీగా, న్యాయంగా ఉంటారు. కాని దుర్మార్గుడు నీతో చెప్పే విషయాలను నమ్మవద్దు.

దుర్మార్గుల మాటలు రక్తంకోసం పొంచి వుంటాయి. కాని మంచి మనుష్యుల మాటలు వారిని అపాయం నుండి తప్పిస్తాయి.

దుర్మార్గులు నాశనం చేయబడగా ఇంకేమీ మిగులదు. అయితే మంచి మనుష్యులు వెళ్లిపోయిన తరువాత చాలా కాలం వరకు మనుష్యులు వారిని జ్ఞాపకం చేసికొంటారు.

జ్ఞానము గల మనిషిని ప్రజలు పొగుడుతారు. కాని మూర్ఖుడైన మనిషిని ప్రజలు గౌరవించరు.

భోజనం లేకపోయినా, ప్రముఖునిలా నటించే మనిషిలా ఉండటంకంటె, ప్రముఖుడు కాకపోయినా కష్టపడి పనిచేసే మనిషిలా ఉండటం మేలు.

10 మంచి మనిషి తన పశువుల విషయం శ్రద్ధ తీసుకొంటాడు. కాని దుర్మార్గులు దయగా ఉండలేరు.

11 తన పొలంలో పనిచేసే రైతుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని పనికిమాలిన ఆలోచనలతో సమయం వృధా చేసేవాడు బుద్ధిహీనుడు.

12 దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు పసులు చేయాలని చూస్తుంటారు. కాని మంచివాళ్లకు చెట్ల వేర్లవలెలోతుకు చొచ్చుకొనిపోయే బలం ఉంటుంది.

13 దుర్మార్గుడు తెలివి తక్కువ విషయాలు మాట్లాడి, తన మాటలచేత పట్టుబడతాడు. కాని మంచి మనిషి అలాంటి కష్టం నుండి తప్పించుకొంటాడు.

14 ఒక వ్యక్తి తాను చెప్పే మంచి విషయాల మూలంగా బహుమానం పొందుతాడు. అదే విధంగా అతడు చేసే పనివల్ల అతనికి లాభం కలుగుతుంది.

15 బుద్ధిహీనుడు ఎల్లప్పుడూ తన స్వంత విధానమే మంచిదని తలస్తాడు. కాని జ్ఞానముగలవాడు ఇతరులు తనతో చెప్పే మాటలు వింటాడు.

16 బుద్ధిహీనుడు త్వరగా కలవరం చెందుతాడు. అయితే ఇతరులు ఏదైనా తప్పు చెప్పినప్పుడు తెలివిగలవాడు త్వరగా క్షమిస్తాడు.

17 ఒక వ్యక్తి సత్యం చెబితే, అతడు చెప్పే విషయాల్లో నిజాయితీ గలవాడే. కాని ఒకడు అబద్ధాలు గనుక చెబితే, అది కష్టాలకు దారి తీస్తుంది.

18 ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు. అయితే జ్ఞానముగలవాడు అతడు చెప్పే విషయాల గూర్చి జాగ్రత్తగా ఉంటాడు. అతని మాటలు ఆ బాధను నయం చేయవచ్చును.

19 ఒక వ్యక్తి అబద్ధం చెబితే, ఆ మాటలు వేగంగా వ్యర్థం అవుతాయి. కాని సత్యం శాశ్వతంగా జీవిస్తుంది.

20 దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టం కలిగించాలని కోరుకొంటారు. అయితే శాంతికోసం పని చేసేవారు సంతోషంగా ఉంటారు.

21 మంచి మనుష్యులు యెహోవా చేత క్షేమంగా కాపాడబడుతారు. కాని చెడ్డవాళ్లకు చాలా కష్టాలు ఉంటాయి.

22 అబద్ధాలు చెప్పే వాళ్లంటే యెహోవాకు అసహ్యం. అయితే సత్యం చెప్పే వాళ్ల విషయం యెహోవాకు సంతోషం.

23 చురుకైనవాడు తనకు తెలిసిన అన్ని విషయాలూ చెప్పడు. కాని బుద్ధిహీనుడు అన్నీ చెప్పి, తాను బుద్ధిహీనుడను అని చూపెట్టుకొంటాడు.

24 కష్టపడి పనిచేసే మనుష్యులు ఇతరుల మీద అధికారులుగా నియమించబడుతారు. అయితే సోమరి బానిసలా పనిచేయాల్సి ఉంటుంది.

25 చింతించటం ఒక మనిషి సంతోషాన్ని తీసివేయగలదు. కాని దయగల ఒక మాట ఒక మనిషిని సంతోష పెట్టగలదు.

26 మంచివాడు తన చుట్టూవున్న వాళ్లకంటే ఎక్కువ పొందుతాడు. దుర్మార్గుల చెడు నడతలే వాళ్లను చెడు మార్గాలలో పెట్టి, విజయం నుండి తప్పిస్తాయి.

27 బద్ధకస్తుడు తాను కోరుకొనే వాటి వెనుక వెళ్లడు. కాని కష్టపడి పనిచేసే వానికి ఐశ్వర్యాలు వస్తాయి.

28 నీవు సరైన విధంగా జీవిస్తే, అప్పుడు నీకు నిజమైన జీవం ఉంటుంది. అదే శాశ్వతంగా జీవించటానికి మార్గం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International