Chronological
షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట
10 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది. 2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది. 3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు. 4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది. 5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది! 7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి. 8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది! 9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల[a] బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప[b], వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి. 12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారలను, స్వరమండలములను చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
సొలొమోను గొప్ప సంపద
14 ప్రతి సంవత్సరం సొలొమోనుకు సుమారు ఒకవెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగుల[c] బంగారం వచ్చేది. 15 ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజులనుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాలకుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది.
16 రాజైన సొలొమోను పలకలుగా కొట్టబడిన బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాళ్లను చేయించాడు. ప్రతిడాలు ఆరు వందల తులాల[d] బంగారం కలిగి వుండేది. 17 అతడింకా మూడు వందల చిన్న తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో చేయించాడు. ప్రతిడాలు నూట అరువది తులాల బంగారం కలిగివుంది. రాజు వాటిని “లెబానోను అరణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు.
18 రాజైన సొలొమోను ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు పూత పూయించాడు. 19 సింహాసనం ముందు ఆరుమెట్లు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువైపులా చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. సింహాసనపు చేతులు గాక సింహాల విగ్రహాలు కూడ సింహాసనానికి ఇరుప్రక్కల వున్నాయి. 20 ఆరు మెట్లలో ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మలను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా సింహాలంకరణ చేసి ఉండలేదు.
21 లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!
22 వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి సొలొమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు తేబడేవి.
23 ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు. రాజులందరికంటె అతనికి ధనం, తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి. 24 ప్రతి చోట ప్రజలు రాజైన సొలొమోనును చూడాలని ఆరాట పడేవారు. యెహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని వారంతావిని తెలుసుకుని ఆనందించాలని కుతూహలపడేవారు. 25 ప్రతి సంవత్సరం రాజును చూడ్డానికి ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏదో ఒక కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చేవారు.
26 కావున సొలొమోను అనేక రథములను, గుర్రములను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు వందల రథములు, పన్నెండు వేల గుర్రములు వున్నాయి. సొలొమోను ప్రత్యేక నగరాలను నిర్మించి ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన సొలొమోను కొన్ని రథాలను తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 27 రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది. 28 ఈజిప్టు నుంచి, కూషునుంచి సొలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని వర్తకులు వాటిని కూయిలో కొన్ని ఇశ్రాయేలుకు తెచ్చేవారు. 29 ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.
సొలొమోను, అతని భార్యలు
11 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమార్తె, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు. 2 గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. 3 సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమార్తెలే). అతనికి ఇంకను మూడు వందల మంది స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు. 4 సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు. 5 సొలొమోను అష్తారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర దేవత విగ్రహం. 6 ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.
7 కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన దేవత విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక దేవత విగ్రహం. 8 ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.
9 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. 10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు. 11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెబుతున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను. 12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను. 13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”
సొలొమోను శత్రువులు
14 ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు. 15 అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు. 16 యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు. 17 కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు. 18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.
19 హదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హదదుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు) 20 అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహమాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు గెనుబతు. రాణి తెహ్పెనేసు గెనుబతును తన పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది.
21 దావీదు చనిపోయినట్లు ఈజిప్టులో వున్న హదదు విన్నాడు. సైన్యాధిపతి యోవాబు కూడ చనిపోయినట్లు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు వెళ్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని అడిగాడు.
22 “నీకు ఇక్కడ కావలసినవన్నీ సమకూర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను కుంటున్నావు?” అని ఫరో అన్నాడు.
అయితే హదదు మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్లనీయండి” అని ప్రాధేయపడ్డాడు.
23 సొలొమోనుకు మరొక వ్యక్తి శత్రువయ్యేలా యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడైన రెజోను. రెజోను తన యజమాని వద్ద నుండి పారిపోయాడు. సోబా రాజైన హదదెజరు ఇతని యజమాని. 24 దావీదు సోబా సైన్యాన్ని ఓడించిన పిమ్మట రెజోను కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు. 25 రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను ఇశ్రాయేలును అసహ్యించుకొనేవాడు. కావున సొలొమోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో చాలా అలజడిని సృష్టించారు.
26 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు.
27 యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు. 28 యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు[e] చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు. 29 ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు.
30 అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు. 31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను. 32 కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను. 33 సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్తారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు. 34 కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు. 35 ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను. 36 సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను. 37 కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు. 38 నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను. 39 ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.’”
సొలొమోను మరణం
40 సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు.
41 తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. 42 యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు. 43 తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు[f] అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.
షేబదేశపు రాణి సొలొమోనును దర్శించటం
9 షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లాడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి. 2 ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు. 3 సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతులను షేబ దేశపు రాణి స్వయంగా చూసింది. 4 సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థాలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను అర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!
5 అప్పుడామె రాజైన సొలొమోనుతో యిలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను. 6 నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించి వున్నావు నీవు! 7 నీవు, నీ భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు! 8 నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”
9 తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణుగులు) బంగారం, లెక్కకు మించి సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి ఇచ్చినట్లు రాజైన సొలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు.
10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు[a] నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు. 11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబురలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.
12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.
సొలొమోను మహా సంపద
13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది. 14 సంచార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.
15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది. 16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లను కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.
17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి. 19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.
20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. “లెబానోను అరణ్య” భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.
21 తర్షీషు[b] వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.
22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు. 23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు. 24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కానుకలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.
25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు. 27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో[c] వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది. 28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.
సొలొమోను మరణం
29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు. 30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు. 31 పిమ్మట సొలొమోను చనిపోయాడు.[d] తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.
© 1997 Bible League International