Chronological
జ్ఞానము నిన్ను వ్యభిచారం నుండి కాపాడుతుంది
7 నా కుమారుడా, నా మాటలు జ్ఞాపకం ఉంచుకో నేను నీకు ఇచ్చే ఆజ్ఞలు మరువకు. 2 నా ఆజ్ఞలకు విధేయుడవు కమ్ము, నీకు జీవం కలుగుతుంది. నా ఉపదేశాన్ని కనుపాపలాగ ఎంచుకో. (నీ జీవింతలోకెల్లా అతి ముఖ్యమైనది). 3 నా ఆజ్ఞలను ఉపదేశాలను ఎల్లప్పుడూ నీతో ఉంచుకో. వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. 4 జ్ఞానాన్ని నీ సోదరిగా ఎంచు. తెలివిని నీ కుటుంబంలో ఒక భాగంగా చూసుకో. 5 అప్పుడు అవి పరస్త్రీనుండి నిన్ను కాపాడుతాయి. నిన్ను పాపములోకి ఈడ్చివేయగల చక్కటి మాటలనుండి నిన్ను కాపాడతాయి.
6 ఒక రోజు నేను నా కిటికీలో నుండి బయటకు చూసాను. 7 నాకు బుద్ధిలేని యువకులు చాలా మంది కనబడ్డారు. మరీ బుద్ధిలేని ఒక యువకుడిని నేను చూసాను. 8 ఒక చెడ్డ స్త్రీ ఇంటి దగ్గర వీధిలోకి అతడు నడిచాడు. ఆ యువకుడు ఆ స్త్రీ ఇంటిమూలకు నడిచాడు. 9 సూర్యుడు అస్తమిస్తూండగా దాదాపు చీకటి పడింది. రాత్రి మొదలవుతూంది. 10 ఆ స్త్రీ అతనిని కలుసుకొనేందుకు తన ఇంటి నుండి బయటకు వచ్చింది. ఆమె వేశ్యలా బట్టలు ధరించింది. ఆమె అతనితో పాపం చేయటానికి ప్రయత్నిస్తుంది. 11 పాపం గూర్చి ఆమె లెక్కచేయలేదు. మంచి చెడును గూర్చి ఆమె లెక్క చేయలేదు. ఆమె తన ఇంటివద్ద ఎన్నడూ నిలిచి వుండదు. 12 కాని ఆమె వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా దొరుకుతారు అని చూస్తూ ఆమె అన్ని మూలలకూ వెళ్తుంది. 13 ఆమె ఆ యువకుడ్ని గట్టిగా పట్టేసి ముద్దు పెట్టుకుంది. సిగ్గులేకుండా ఆమె ఇలా చెప్పింది: 14 “ఈవేళ నేను సాంగత్య బలి అర్పించాలి. నేను ఇస్తానని వాగ్దానం చేసింది అంతా ఇచ్చేశాను. (ఇంకా నా దగ్గర భోజనం చాలా మిగిలి ఉంది). 15 అందుచేత నిన్ను కూడా నా దగ్గరకు రమ్మని ఆహ్వానించటానికి నేనిలా బయటకు వచ్చాను. నేను నీకోసం ఎంతో ఎంతో వెదికాను. ఇప్పుడు నీవు కనబడ్డావు! 16 నా మంచం మీద శుభ్రమైన దుప్పట్లు నేను పరిచాను. అవి చాలా, అందమైన ఈజిప్టు దుప్పట్లు. 17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. 18 వచ్చేయి, తెల్లారే వరకు మనం వలపు తీర్చుకొందాం. రాత్రంతా మనం హాయిగా అనుభవించవచ్చు. 19 నా భర్త వెళ్లిపోయాడు. అతడు వ్యాపారం పని మీద వెళ్లిపోయాడు. 20 దీర్ఘప్రయాణానికి సరిపడినంత ధనం అతడు తీసుకొని వెళ్లాడు. రెండు వారాల వరకు అతడు తిరిగి ఇంటికి రాడు.”
21 ఆ యువకుని శోధించటానికి ఆ స్త్రీ ఆ మాటలు ప్రయోగించింది. ఆమె మెత్తని మాటలు అతణ్ణి మాయ చేశాయి. 22 ఆ యువకుడు ఉచ్చులోనికి ఆమెను వెంబడించాడు. వధకు తీసుకొనిపోబడుతున్న ఎద్దులా ఉన్నాడు అతడు. బోనులోనికి నడుస్తున్న జింకలా అతడు ఉన్నాడు. 23 దాని గుండెల్లోకి బాణం గుచ్చడానికి వేటగాడు సిద్దంగా ఉన్నట్టు ఉంది. వలలోకి ఎగురుతోన్న పక్షిలా ఉన్నాడు ఆ యువకుడు. అతడు చిక్కుకొన్న అపాయం అతనికి తెలియదు.
24 కుమారులారా, ఇప్పుడు నా మాట వినండి. నేను చెప్పే మాటలు గమనించండి. 25 చెడు స్త్రీని మిమ్మల్ని పట్టుకోనివ్వకండి. ఆమె మార్గాలు వెంబడించకండి. 26 ఆమె చాలా మంది పురుషులను పడ వేసింది. ఆమె చాలా మంది పురుషులను నాశనం చేసింది. 27 ఆమె ఇల్లు మరణ స్థానం. ఆమె మార్గం తిన్నగా మరణానికి నడిపిస్తుంది!
జ్ఞానము, ఒక మంచి స్త్రీ
8 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
7 నా మాటలు సత్యం.
చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి.
నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
జ్ఞానము విలువ
12 “నేను జ్ఞానాన్ని,
నేను మంచి తీర్పుతో జీవిస్తాను.
తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను.
చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న
ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు,
మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
ఉంచకముందే నేను పుట్టాను.
మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు,
భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
32 “పిల్లలారా, ఇప్పుడు నా మాట వినండి.
మీరు నా మార్గాలు వెంబడిస్తే
మీరు కూడా సంతోషంగా ఉండగలరు
33 నా ఉపదేశాలు విని బుద్ధిమంతులుకండి.
వినుటకు తిరస్కరించకుడి.
34 ఏ వ్యక్తి అయితే వింటాడో అతడు సంతోషంగా ఉంటాడు.
అతను అనుదినం నా ద్వారాల దగ్గర వేచి యుంటాడు.
35 నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును
యెహోవా వద్దనుండి అతడు మంచివాటిని పొందును.
36 అయితే నాకు విరోధముగా పాపముచేయు వ్యక్తి
తనకు తానే హాని చేసుకొంటాడు.
నన్ను అసహ్యించుకొనువారు మరణమును ప్రేమించెదరు.”
జ్ఞానము ఆహ్వానించుట
9 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. 2 ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. 3 అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. 4 “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. 5 “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. 6 మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది.
7 ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. 8 కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. 9 జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు.
10 యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. 11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. 12 నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి.
బుద్ధిహీనత—ఇతర స్త్రీ
13 బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు. 14 ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. 15 ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని 16 “నేర్చుకోవాల్సిన ప్రజలారా, రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది. 17 “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది. 18 ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది!
© 1997 Bible League International