Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37:1-17

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.

రూతు 2:1-16

రూతు బోయజును కలుసుకొనుట

బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు.

ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది.

“సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి.

రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.

బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” అంటూ తన పనివాళ్లను అభినందించాడు.

పనివాళ్లు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ జవాబిచ్చారు.

అప్పుడు ఆయన రూతును చూసి పనివాళ్లపైన నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు.

“ఆమె మోయాబు కొండదేశము నుండి నయోమితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ. పనివాళ్ల వెనక తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను (పరిగె) ఏరుకోనిమ్మని ప్రొద్దున్నే వచ్చి నన్ను ఆడిగింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” అన్నాడు ఆ పెద్ద సేవకుడు.

అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు. మగ వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ ఆక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ పెట్టొద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా మనుషులు త్రాగే పాత్రలోని నీళ్లే త్రాగు.”

10 రూతు తల వంచుకొని, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.”

11 బోయజు ఇలా జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు. 12 నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.”

13 “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.

14 మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి రా! మా భోజనము తిను. రొట్టెను ద్రాక్షారసములో ముంచుకో” అన్నాడు రూతుతో.

కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. బోయజు ఆమెకు కోన్ని పేలాలు పెట్టాడు. రూతు తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము మిగిలాయి. 15 తరువాత రూతు లేచి మళ్లీ పనికి వెళ్లింది.

బోయజు తన పనివారితో, “పనల మధ్యకూడ ఆమెను ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టకండి. 16 ఆమె కోసం కొన్ని కంకులు పనల్లోనుంచి జారవిడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు.

యాకోబు 5:1-6

ధనికులకు హెచ్చరిక

ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు పడుతుంది. వాటి త్రుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు. మీ పొలాల్ని సాగుచేసిన పనివాళ్ళకు మీరు కూలి యివ్వలేదు. వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలివాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు చెవిలోపడ్డాయి.

మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని ఎదిరించటం లేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International