Revised Common Lectionary (Semicontinuous)
ఒక క్రొత్త రోజు వస్తుంది
9 గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ. 2 ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.
3 దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది. 4 ఎందుకంటే, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
సంఘంలో చీలికలు
10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
11 నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయె కుటుంబం నాకు తెలియ చేసింది. 12 నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నాను” అని, ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను కేఫాను[a] అనుసరిస్తున్నాను” అని, నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. 13 అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపై చనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 15 కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు. 16 ఔను, నేను స్తెఫను కుటుంబానికి చెందినవాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు. 17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
నిజమైన జ్ఞానము
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మార్కు 1:14-15; లూకా 4:14-15)
12 యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు. 13 ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. 14 ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:
15 “జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా!
సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా!
యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా!
16 చీకట్లో నివసిస్తున్న ప్రజలు
గొప్ప వెలుగును చూసారు!
మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న
ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”(A)
17 ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు.
యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం
(మార్కు 1:16-20; లూకా 5:1-11)
18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.
21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.
యేసు బోధించి రోగులను నయం చేయటం
(లూకా 6:17-19)
23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు.
© 1997 Bible League International