Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
2 ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
3 అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
4 ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
5 ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.
ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు
18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి. 19 న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది. 20 మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.
నీతి కోసం బాధలనుభవించటం
8 చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. 9 అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది:
“బ్రతకాలని ఇష్టపడే వాడు,
మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
శాంతిని కోరి సాధించాలి.
12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”(A)
© 1997 Bible League International