Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.
సమూయేలు సౌలును అభిషేకించుట
10 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది. 2 ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యులు నీతో అంటారు.
3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది. 4 ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు. 5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు[a] వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. 6 యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు. 7 ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.
8 “నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తరువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబుతాను” అన్నాడు.
అపొస్తలులు పౌలును అంగీకరించటం
2 పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు. 2 దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కానివాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.
3 నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు. 4 మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం. 5 సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.
6 సంఘంలో ముఖ్యమైనవాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు. 7 పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు. 8 పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కానివాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. 9 ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము. 10 మేము పేదవాళ్ళకు సహాయం చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే అభిలాష వుంది.
© 1997 Bible League International