Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89:5-37

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
    ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
    నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
    నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
    నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
    మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
    మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37     చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

ఆదికాండము 35:1-15

బేతేలులో యాకోబు

35 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.

కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”

కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేశారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేశారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం క్రింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.

యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి,[a] యాకోబును వెంబడించలేదు. కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది. అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.

రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం క్రింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూత్ అని వారు పేరు పెట్టారు.

యాకోబు క్రొత్త పేరు

పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయి, యాకోబును యిలా ఆశీర్వదించాడు. 10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ క్రొత్త పేరు ‘ఇశ్రాయేలు’ అని ఉంటుంది.” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

11 అతనితో దేవుడన్నాడు: “నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. 12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.” 13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 14-15 ఈ స్థలంలో ఒక స్మారక శిల[b] యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.

అపొస్తలుల కార్యములు 10:44-48

దేవుడందర్ని అంగీకరిస్తాడని చూపించాడు

44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. 45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. 46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: 47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” 48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International