Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 83

ఆసాపు స్తుతి గీతం.

83 దేవా, మౌనంగా ఉండవద్దు!
    నీ చెవులు మూసికోవద్దు!
    దేవా, దయచేసి ఊరుకోవద్దు.
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
    నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
    నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
    అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
    ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
    గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
    ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
    వారంతా నిజంగా బలముగలవారయ్యారు.

దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
    యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
    వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
    జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
    ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
    గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
    కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
    సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
    అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
    వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
    అని వారు తెలుసుకొంటారు.

ఆదికాండము 31:17-35

17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు. 18 అప్పుడు వాళ్లు అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు. 19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.

20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేశాడు. అతడు వెళ్లిపోతున్నట్లు లాబానుతో చెప్పలేదు. 21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.

22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. 23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు. 24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.

దొంగిలించిన దేవుళ్ల కోసం వెదకుట

25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసుకొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.

26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేశావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు? 27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి. 28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని. 29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు. 30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్లు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”

31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను. 32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.

33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు. 34 రాహేలు తన ఒంటె సామగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.

35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను ఋతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.

గలతీయులకు 3:1-9

ధర్మశాస్త్రమా? లేక విశ్వాసమా?

గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో ఉన్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్తను విశ్వసించటం వల్ల పొందారా? మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా? మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?

అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A) కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, “అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!”(B) అని ముందే చెప్పాడు. కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International