Revised Common Lectionary (Semicontinuous)
నాబోతు ద్రాక్షతోట
21 రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది. 2 ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలనుకుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”
3 నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు.
4 అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు.
5 అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది.
6 అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”
7 అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది.
8 తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది. 9 ఆమె పంపిన లేఖలో ఇలా వుంది:
“ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశపర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి. 10 నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.”
11 అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు. 12 ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు. 13 అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు. 14 తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు.
15 ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది. 16 కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు.
17 ఇదే సమయంలో యెహోవా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు: 18 “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు. 19 యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: ‘అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!’”
20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు.
ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధంగా పాపం చేస్తూనే వచ్చావు. 21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను.
సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన
5 యెహోవా, నా మాటలు ఆలకించుము.
నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
2 నా రాజా, నా దేవా
నా ప్రార్థన ఆలకించుము.
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
అది నాకు తేటగా చూపించుము.
15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కానివాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు. 16 ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని విశ్వసించాము.
17 మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు. 18 నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినవాణ్ణవుతాను. 19 నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది. 20 నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను. 21 దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రంవల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు?
పాపపు స్త్రీ యేసు పాదాలకు అత్తరు పూయటం
36 ఒకసారి ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి భోజనానికి పిలిచాడు. యేసు అతని యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని ఉండగా, 37 ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది. 38 వెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. వాటిపై అత్తరు పోసింది.
39 ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు.
40 యేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం చెప్పాలి!” అని అన్నాడు.
“చెప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు.
41 యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుండినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, యింకొకడు యాభై దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు. 42 ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు.
43 “ఎక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొంటాను” అని సీమోను సమాధానం చెప్పాడు.
యేసు, “నీ తీర్పు సరియైనది” అని అన్నాడు. 44 ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. 45 నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం మానలేదు. 46 నీవు నా తలకు నూనె అంటలేదు. కాని ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. 47 అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు.
48 ఆ తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
49 అక్కడున్న మిగతా అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడెవరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
50 యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. శాంతంగా వెళ్ళు!” అని అన్నాడు.
యేసుతో ఒక గుంపు
8 ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. 2 దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. 3 హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు.
© 1997 Bible League International