Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 5:1-8

సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, నా మాటలు ఆలకించుము.
    నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
నా రాజా, నా దేవా
    నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
    సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.

యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
    చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
    ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
    ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.

యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
    యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
    కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
    అది నాకు తేటగా చూపించుము.

1 రాజులు 20:1-22

బెన్హదదు, అహాబు యుద్ధానికి తలపడుట

20 బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు. ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు. వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”

ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటున్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”

దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను. నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”

ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”

ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.

బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.”

రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు. 10 బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను! నా మనుష్యులు గుర్తుగా[a] ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయకపోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”

11 రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు”[b] అని చెప్పమన్నాడు.

12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.

13 అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”

14 “వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్వాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు.

“నీవే” అని ప్రవక్త అన్నాడు.

15 కావున అహాబు యువ ప్రభుత్వాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.

16 మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది. 17 యువ ప్రభుత్వాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు అతనితో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు. 18 “అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.

19 రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది. 20 ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపివేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.

21 రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.

22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”

యాకోబు 4:1-7

దేవుణ్ణి శరణు కోరండి

మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.

నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను[a] మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.” దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు”(A) అని వ్రాయబడింది.

అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International