Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 135

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

యెహెజ్కేలు 8

దేవాలయం వద్ద జరిగిన పాప క్రియలు

ఒకరోజు నేను (యెహెజ్కేలు) నా ఇంటిలో కూర్చొని ఉన్నాను. యూదా పెద్దలు నా ముందు కూర్చున్నారు. ఇది చెరబట్టబడిన కాలంలో ఆరవ సంవత్సరం, ఆరవ నెల (సెప్టెంబరు) ఐదవ రోజున జరిగింది. నా ప్రభువైన యెహోవా శక్తి అకస్మాత్తుగా నామీదికి వచ్చింది. అగ్నివంటి రూపాన్నొకటి నేను చూశాను. అది మానవ శరీరంలా ఉంది. నడుము నుండి క్రిందికి అది అగ్నిలా కన్పించింది. నడుము నుండి పైకి ఆ ఆకారం దేదీప్యమానంగా వెలుగొందుతూ, అగ్నిలో కర్రుకాలిన లోహంలా ఉంది. పిమ్మట చెయ్యివంటిదొకటి నేను చూశాను. ఆ చెయ్యి నా మీదికి వచ్చి నా తలపై జుట్టుపట్టుకుంది. పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపింది. ఆ దేవదర్శనంలో ఆయన నన్ను యెరూషలేముకు తీసుకొని వెళ్లాడు. ఆయన నన్ను లోపలి ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. అది నగరానికి ఉత్తర దిశన ఉంది. ఆ ద్వారం దగ్గరే దేవుడు అసూయపడేలా చేసిన విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. కాని ఇశ్రాయేలు దేవుని మహిమ అక్కడ ఉంది. ఆ మహిమ నేను కెబారు కాలువ వద్ద లోయలో చూసిన దర్శనంలా ఉంది.

దేవుడు నాతో మాట్లాడుతూ, “నరపుత్రుడా, ఉత్తర దిశవైపు చూడు!” అన్నాడు. నేను ఉత్తరానికి చూశాను. అక్కడ బలిపీఠం వద్దగల ద్వారానికి ఉత్తరంగా దేవుడు అసూయ పడునట్లు చేసిన విగ్రహం ఉంది.

మళ్లీ దేవుడు నాకు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి భయంకరమైన పనులు చేస్తున్నారో నీవు చూస్తున్నావా? వారు దానిని ఖచ్చితంగా నా ఆలయం ప్రక్కనే నెలకొల్పారు! నీవు నాతో వస్తే, ఇంకా భయంకరమైన విషయాలు చూస్తావు!”

అందువల్ల నేను ఆవరణద్వారం వద్దకు వెళ్లాను. గోడలో ఒక రంధ్రాన్ని చూశాను. దేవుడు నాతో, “నరపుత్రుడా, గోడలో ఒక రంధ్రం చెయ్యి” అని చెప్పాడు. కాబట్టి నేను ఆ తలుపులో ఒక రంధ్రాన్ని చేశాను. లోపల ఒక తలుపు కన్పించింది.

అప్పుడు దేవుడు నాతో, “లోనికి వెళ్లి ఇక్కడ ప్రజలు చేస్తున్న భయంకరమైన, దుష్టమైన పనులను చూడు” అని అన్నాడు. 10 నేను లోనికి వెళ్లి చూశాను. అక్కడ మీరు ఊహించటానికే అసహ్యకరమైన పాముల, బల్లుల, క్రిమికీటకాదుల, ఇతర జంతువుల ప్రతిమలు, శిల్పాలు ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలీయులు ఆరాధించే హేయమైన విగ్రహాలు. ఆ జంతువుల బొమ్మలు అన్ని గోడల మీదా చుట్టూ చెక్కబడి ఉన్నాయి!

11 అక్కడ షాఫాము[a] కుమారుడైన యజన్యాయును, మరి డెబ్బయి మంది ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) ప్రజలతో కలసి ఆ స్థలంలో ఆరాధిస్తున్నారు. వారు ఖచ్చితంగా ప్రజల ముందు నిలబడి ఉన్నారు! ప్రతీ పెద్ద మనిషి చేతిలో ఒక ధూప కలశం ఉంది. సాంబ్రాణి ధూపం గాలిలోకి లేస్తూ ఉంది. 12 అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో ఏమి చేస్తున్నారో నీవు చూశావా? ప్రతి ఒక్కడూ తన బూటకపు దేవునికి ఒక గది కలిగి ఉన్నాడు! ‘మనల్ని యెహోవా చూడలేడు. యెహోవా ఈ దేశాన్ని వదిలేశాడు’ అని వారిలో వారనుకుంటున్నారు.” 13 దేవుడు మళ్లీ, “నీవు నాతో వస్తే, ఆ మనుష్యులు మరీ భయంకరమైన పనులు చేయటం చూస్తావు!” అని అన్నాడు.

14 దేవుడు నన్ను ఆలయ ద్వారం వద్దకు తీసుకొని వెళ్లాడు. ఈ ద్వారం ఉత్తరపు దిక్కున ఉంది. అక్కడ స్త్రీలు కూర్చుని, ఏడ్వటం చూశాను. వారంతా బూటకపు దైవము తమ్మూజును[b] గురించి దుఃఖిస్తున్నారు!

15 దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ భయంకరమైన విషయాలు గమనించావా? నా వెంట రమ్ము. నీవింతకంటే ఘోరమైన విషయాలు చూస్తావు!” 16 ఆయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణలోనికి తీసుకొని వెళ్లాడు. ఆక్కడ ఇరవైఐదు మంది క్రిందికి వంగి ఆరాధించటం చూశాను. వారు ముందు మండపానికి, బలి పీఠానికి మధ్యలో ఉన్నారు. కాని వారు తప్పు దిశకు తిరిగి కూర్చున్నారు! వారి వీపులు పవిత్ర స్థలానికి వెనుతిరిగి ఉన్నాయి. వారు సూర్యుణ్ణి ఆరాధించటానికి వంగు తున్నారు!

17 అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, ఇది చూశావు గదా! యూదా ప్రజలు ఈ నా ఆలయాన్ని అతి సామాన్యమైనదిగా భావిస్తూ, ఆలయంలోనే వారు చెడు పనులు కొనసాగిస్తున్నారు.! ఈ దేశమంతా దౌర్జన్యంతో నిండిపోయింది. వారు నిరంతరం చెడుకార్యాలు చేస్తూ నాకు పిచ్చి పట్టిస్తున్నారు. చూడు, ఒక బూటకపు దేవతలా చంద్రుని ఆరాధించటానికి వారు ముక్కులకు ఉంగరాలు[c] పెట్టుకుంటున్నారు. 18 వారికి నా కోపం చూపిస్తాను! వారిపట్ల ఏమాత్రం కనికరం చూపించను! వారిని గురించి నేను విచారించను! వారు ప్రాధేయపడి నన్ను పిలుస్తారు. కాని వారి అభ్యర్థనను నేను వినను!”

అపొస్తలుల కార్యములు 8:26-40

ఫిలిప్పు ఇతియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం

26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.

27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇతియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇతియొపీయుల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, 28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,

29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అతన్ని కలుసుకో” అని అన్నాడు. 30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.

31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. 32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు:

“చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
    ఆయన మాట్లాడ లేదు!
33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
    ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?”(A)

34 ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పు” అని అడిగాడు. 35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.

36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. 37 ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. 38 ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. 39 వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు. 40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడినుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International