Revised Common Lectionary (Semicontinuous)
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
ఇశ్రాయేలు రాజుగా అహాబు
29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు. 30 అహాబు యెహోవా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు. 31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమార్తెయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు. 32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. 33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.
34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని మరల నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది.[a]
పౌలు మరియు అబద్ధపు అపొస్తలులు
11 నా తెలివితక్కువతనాన్ని మీరు కొద్దిగా సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని నాకు తెలుసు. 2 మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను. 3 సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్ధాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం. 4 ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.[a]
5 ఆ “గొప్ప అపొస్తలుల కన్నా” నేను కొంచెం కూడా తక్కువ కానని అంటున్నాను. 6 మాట్లాడటంలో నాకు అనుభవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము అన్ని విధాలా మీకు స్పష్టంగా తెలియజేసాము.
© 1997 Bible League International