Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 9-12

దేవుని సందేశకులు యెరూషలేమును శిక్షించుట

పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయుధం కలిగి ఉన్నాడు. పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు[a] ధరించాడు. అతని నడుముకు లేఖకుని కలం, సిరాబుడ్డి[b] వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.

పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.

5-6 మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.

ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.

ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.

అది విన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, ‘యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు కనుక మనం చేసే పనులను ఆయన చూడలేడు’ అని అనుకొంటున్నారు. 10 కాని నేను ఏ మాత్రం కనికరం చూపను. ఈ ప్రజలు పట్ల విచారించను. వారు దాన్ని వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి అర్హమైన శిక్ష విధిస్తున్నాను!”

11 పిమ్మట నారబట్టలు ధరించి కలం, సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను” అని అన్నాడు.

యెహోవా మహిమ దేవాలయమును వదలుట

10 తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివేయి.”

ఆ వ్యక్తి నా ప్రక్క నుండి వెళ్లాడు. ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది. ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.

నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం ప్రక్కగా నిలబడ్డాడు. కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. (కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)

అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల ప్రక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి. 10 మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. 11 కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 12 వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి! 13 నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.

14-15 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం.[c] రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే.

పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు. 16 వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 17 కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.

18 తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది. 19 అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపై నిలిచింది.

20 అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ క్రింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను. 21 ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల క్రింద ఉన్నాయి. 22 కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ ఉన్నాయి.

నాయకులకు విరోధంగా ప్రవచనాలు

11 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవైఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.

పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం ప్రోత్సహిస్తారు. ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు. వారీ అబద్ధాలు చెపుతున్నారు. కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క నిజాలను ప్రకటించు.”

ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి వచ్చాడు. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయపూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు! మీరీ నగరంలో అనేక మందిని చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపివేశారు. ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు! మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి నేను కత్తిని తీసుకువస్తున్నాను!’” మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి నెరవేరితీరుతాయి!

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను! 10 మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. నేనే యెహోవాను. 11 అవును. ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. 12 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ వున్న దేశాల ప్రజల మాదిరిగానే మీరూ జీవించటానికి నిర్ణయించుకున్నారు.”

13 నేను దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన వెంటనే బెనాయా కుమారుడైన పెలట్యా చని పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: “నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు!”

యెరూషలేము శేషులకు విరోధంగా ప్రవచనాలు

14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.

16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నివసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను. 17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను! 18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ వారు నాశనం చేస్తారు. 19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను తీసివేసి, దాని స్థానంలో మాంసపు గుండెను అమర్చుతాను. 20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”

యెహోవా మహిమ యెరూషలేమును వదలుట

21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు. 22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది. 23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ[d] మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు. 24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చాడు. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లాడు. అవన్నీ నేను దర్శనంలో చూశాను. 25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.

యెహెజ్కేలు బంధీగా వదలుట

12 తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య వున్నావు. వారు ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా వుంటున్నారు. నేను వారి కొరకు చేసిన పనులను చూడటానికి వారికి కళ్ళున్నాయి. అయినా వాటినివారు చూడలేరు. వారిని నేను చేయమని చెప్పిన విషయాలను వినటానికి వారికి చెవులున్నాయి. అయినా వారు నా ఆజ్ఞలను వినరు. ఎందువల్లనంటే వారు తిరుగుబాటుదారులు. కావున, నరపుత్రుడా, నీ సామాన్లు సర్దుకో. నీవొక సుదూర దేశానికి పోతున్నట్లు నటించు. ప్రజలిదంతా చూసేలా నీవు చేయాలి. బహుశః వారు నిన్ను చూడవచ్చు. కాని వారు మిక్కిలి తిరుగుబాటుదారులు.

“ప్రజలు నిన్ను చూసే విధంగా నీ సామాన్లు పగటిపూట బయటకు తీసుకొని వెళ్ళు. మళ్లీ సాయంత్రం నీవొక బందీవలె దూరదేశానికి వెళ్తున్నట్లు ప్రవర్తించు. మళ్లీ ఆ జనులు గమనిస్తూ వుండగా గోడకు కన్నం పెట్టి, దాని గుండా నీవు బయటికి వెళ్లు. రాత్రిపూట నీ సామాను సంచి భుజం మీద వేసుకొని బయలుదేరు. నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావో నీకే తెలియని విధంగా నీ ముఖాన్ని కప్పుకోవాలి. జనులు నిన్ను గమనించేందుకు నీవీ పనులు చేయాలి. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఒక ఆదర్శంగా నేను నిన్ను వినియోగించుకుంటున్నాను!”

కావున నేను (యెహెజ్కేలు) యెహోవా ఆజ్ఞ ప్రకారం చేశాను. పగటివేళ నా సంచులు తీసుకొని నేనొక దూరదేశానికి వెళ్లి పోతున్నట్లు నటించాను. ఆ సాయంత్రం నా చేతులతో గోడకు కన్నం వేశాను. రాత్రివేళ నా సంచి చంకకు తగిలించుకొని బయలు దేరాను. ఈ పనులన్నీ ప్రజలు గమనించే విధంగా చేశాను.

మరునాటి ఉదయం యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలీయులైన ఆ తిరుగుబాటుదారులు నీవు ఏమి చేస్తున్నావని నిన్ను అడిగారా? 10 వారి ప్రభువగు యెహోవా ఈ విషయాలు చెప్పాడని తెలియజేయి. ఈ విషాద సమాచారం యెరూషలేము నాయకునకు (పాలకుడు), అక్కడ నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరికీ సంబంధించినది. 11 ‘మీ అందరికీ నేను (యెహెజ్కేలు) ఒక ఆదర్శం అనీ, నేను చేసి చూపించినవి మీకు తప్పక జరుగుతాయని’ చెప్పుము. మీరు తప్పక దూరదేశాలకు బలవంతాన బందీలుగా తీసుకొని పోబడతారు. 12 మీ నాయకుడు (పాలకుడు) రాత్రి పూట గోడకు కన్నం వేసి దొంగచాటుగా బయటకు పారిపోతాడు. ప్రజలతనిని గుర్తు పట్టకుండా, అతడు తన ముఖాన్ని కప్పుకుంటాడు. అతడెక్కడికి వెళ్ళుచున్నాడో అతని కన్నులు చూడలేవు. 13 అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. కాని నేను (దేవుడు) అతనిని పట్టుకుంటాను! అతడు నా వలలో చిక్కుకుంటాడు. నేనతనిని కల్దీయుల రాజ్యమైన బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వస్తాను. కాని అతడు మాత్రం తనెక్కడికి పోతున్నాడో చూడలేడు. శత్రువు అతని కన్నులను పీకి గుడ్డివాణ్ణి చేస్తాడు అప్పుడు అక్కడ అతడు చనిపొతాడు. 14 రాజ వంశీయులను ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యదేశాలలో నివసించేలా వారిని ఒత్తిడి చేస్తాను. అతని సైన్యాన్ని చెల్లా చెదురు చేస్తాను. శత్రు సైన్యాలు వారిని తరిమి కొడతాయి. 15 అప్పుడా ప్రజలు నేను యెహోవాను అని తెలుసుకొంటారు. నేనే వారిని అన్యదేశాలలో విసిరి వేశానని తెలుసుకొంటారు. ఇతర దేశాలకు పోయేలా వారిని నేనే ఒత్తిడి చేశానని తెలుసుకొంటారు.

16 “కాని కొద్దిమంది ప్రజలను మాత్రం బ్రతక నిస్తాను. రోగాలవల్ల గాని, ఆకలిచేత గాని లేక యుద్ధం వల్ల గాని వారు చనిపోరు. వారు నాపట్ల చేసిన భయంకర నేరాలను గురించి ఇతర ప్రజలకు తెలియజెప్పటానికిగాను వారిని నేను బ్రతకనిస్తాను. పిమ్మట వారు నేను యెహోవానని తెలుసుకొంటారు.”

భయంతో వణకుట

17 ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడుతున్నట్లు ప్రవర్తించాలి. 19 ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. 20 మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.’”

నాశనం వస్తుంది

21 యెహోవా వాక్కు నాకు మరల వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 22 “నరపుత్రుడా, ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడుకుంటారు?

‘ఆపద త్వరలో రాదు,
    దర్శనాలు నిజం కావు.’

23 “వారి ప్రభువైన యెహోవా ఆ పాటను ఆపుచేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ పాటపాడతారు.

‘ఆపద ముంచుకు వస్తూ ఉంది,
    స్వప్న దర్శనాలన్నీ నిజమై తీరుతాయి.’

24 “నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శనాలు ఉండవు. నీజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రికులు మరి ఉండబోరు. 25 ఎందువల్లనంటే, నేనే యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలంలోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబాటు ప్రజలారా, నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీ నా ప్రభువైన యెహోవా చెప్పిన మాటలు.

26 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 27 “నరపుత్రుడా, నేను నీకిచ్చిన దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి చాలా సంపత్సరాల తరువాత జరుగబోయే విషయాలను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటున్నారు. 28 కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International