Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 18-22

కుమ్మరి మరియు బంకమట్టి

18 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది: “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”

నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం) పై కుండలు చేస్తున్నాడు. బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.

అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది: “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను! నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని క్రిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టిన పథకాన్ని నేను అమలుపర్చను. ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు. 10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.

11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’ 12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.’”

13 యెహోవా చెప్పే విషయాలు వినండి:

“అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి:
    ‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’
పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!
14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు.[a]
    లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు.
    అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు.
    వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు.
    నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు.
వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు.
    నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు.
గతుకుల బాటలపై నడుస్తారు.
    కాని వారు మంచి మార్గంపై నన్ననుసరించరు!
16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది!
ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు.
    ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను.
    బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను.
నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు.
    మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”

ప్రజల కుట్ర, యిర్మియా విన్నపం

18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”

19 యెహోవా, నా మనవి ఆలకించుము.
    నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.
20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను.
    వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు.
    నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.
21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి.
    వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక!
వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక!
    యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక!
    వారి భార్యలను వితంతువులుగా చేయి.
    వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక!
    నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి.
నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక!
    నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.
23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు.
    వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు.
నా శత్రువులను మట్టు బెట్టు!
    నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!

పగిలిన జాడీ

19 యెహోవా నాతో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి. యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి[b] ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము. నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కడు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు. నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్ననుసరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు. బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు. మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు. యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము చేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతైపోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను. ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు. శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’

10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని క్రింద పడవేసి పగుల గొట్టుము. 11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల క్రొత్త జాడీగా కూర్చలేము. 12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు. 13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.’”

14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు: 15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”

యిర్మీయా, పషూరు

20 ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా ఈ భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య[c] వేయించాడు. ఆ మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్[d] అని పేరు పెడతాడు. ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు. యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు. ఓ పషూరూ, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబులోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబులోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబులోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.’”

ఐదవసారి యిర్మీయా విన్నపం

యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను.
    నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు.
నేను నవ్వుల పాలయ్యాను.
    రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను.
    దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను.
    యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను.
కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి,
    హేళనచేస్తున్నారు.
“నేనిక దేవుని గురించి మర్చిపోతాను.
    ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!”
అని నేను కొన్ని సార్లు అనుకున్నాను.
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది!
    అది నన్ను లోపల దహించి వేస్తుంది.
దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను.
    ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను.
    ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను.
    నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు.
    “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం!
    లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు!
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు.
    తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు.
    లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు.
    యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు.
కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు.
    వారు నన్ను ఓడించలేరు.
వారి ప్రయత్నం వ్యర్థం.
    వారు ఆశా భంగం చెందుతారు.
వారు అవమానం పాలవుతారు.
    వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.

12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు.
    మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు.
ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను
    కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము!
యెహోవా పేద వారిని ఆదుకుంటాడు!
    ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!

యిర్మీయా ఆరవసారి మొరపెట్టుకొనుట

14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక!
    నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము
    “నీకు పుత్ర సంతానం కలిగింది”
అని చెప్పి అతడు
    నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.
16 యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే[e] ఆ మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక!
    యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు
వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక!
    మధ్యాహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!
17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో
    ఉండగానే నన్ను చంపలేదు.
అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే
    నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది.
    నేను పుట్టివుండే వాడినే కాను.
18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు?
    నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే!
    నా జీవితం అవమానంతో అంతమవుతుంది.

సిద్కియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట

21 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు[f] అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు. యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన[g] నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”

అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల[h] నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను.

“‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను. యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు. అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’

“యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబులోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”

11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
    ‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
    నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
    నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
    దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
    గనుక ఇది జరుగుతుంది.’

13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
    నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
    నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
    ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
    ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.

14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
    ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”

దర్మార్గపు రాజులకు వ్యతిరేకంగా తీర్పు

22 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు. ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి. యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు. ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారి అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు. కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది.’”

యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే:

“గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది
    లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది
కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను.
    నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.
ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను.
    ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది.
అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను వారు నరికి వేస్తారు.
    నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.

“ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం ప్రక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమునకు ఎందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు. దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.’”

యెహోయాహాజురాజు (షల్లూము)కు వ్యతిరేకంగా తీర్పు

10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు.[i]
    అతని కొరకు విచారించవద్దు.
కాని ఇక్కడ నుండి వెళ్లి పోయే రాజు కొరకు
    మిక్కిలిగా దుఃఖించండి.[j]
అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే అతడు మరి తిరిగి రాడు.
    యెహోయాహాజు తన మాతృ భూమిని మరల చూడడు.

11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు. 12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”

రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా తీర్పు

13 “రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు.
    తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు.
    పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు.
    నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు.
    వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.

14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను.
    ‘పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,’ అని యెహోయాకీము అంటాడు.
అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు.
    వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.

15 “యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప
    నిన్ను గొప్ప రాజును చేయదు.
నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు.
    అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు.
    యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.
16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు.
    యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్యంగా జరిగి పోయింది.
యెహోయాకీమా, ‘దేవుని తెలుసు కొనుట’ అంటే ఏమిటి?
దీనులకు దరిద్రులకు సహాయం చేయటం
    మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.”
ఇదే యెహోవా వాక్కు.

17 “యెహోయాకీమా, నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి.
    ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది.
అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు
    ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్టపడుతున్నావు.”

18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా:
    “యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను!
    అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’
అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు.
యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు.
‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
    ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’
    అని వారతనిని గురించి చెప్పరు.
19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు.
    అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.

20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి.
    నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి.
అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు.
    ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.

21 “యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నట్టు భావించావు.
    కాని నిన్ను నేను హెచ్చరించాను!
నేను నిన్ను హెచ్చరించినా
    నీవు లక్ష్యపెట్టలేదు!
నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు.
యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు
22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది.
    అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది.
ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు.
కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి.
    అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది.
నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గుపడతావు.

23 “ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు.
    ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీవున్నట్లుగా వుంది.
కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు
    సురక్షితం అనుకుంటున్నావు.
కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు.
    స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”

యెహోయాకీను (కొన్యా) పై తీర్పు

24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, నేను నివసించునంత నిశ్చయముగ చెపుతున్నాను.” ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను! 25 యెహోయాకీనూ, నిన్ను నేను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, కల్దీయులకు అప్పగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు. 26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు. 27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు. నీవు వచ్చుటకు నేను అనుమతించను.”

28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది.
    ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు.
యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు?
    వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?
29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా!
    యెహోవా వర్తమానం వినుము!
30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి:
    ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క!
తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు.
    అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు.
అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.’”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International