Chronological
దేవాలయం వద్ద యిర్మీయా పాఠం
26 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో[a] ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. 2 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు. 3 బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను. 4 నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను మీకు అందించాను. మీరు నాకు విధేయులై నా సూక్తులను పాటించాలి! 5 నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు. 6 మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం[b] మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.’”
7 దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు. 8 ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టుకున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పినందుకు నీవు చనిపోవలసినదే! 9 యెహోవా పేరట అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.
10 ఇప్పుడు యూదా పాలకులు జరుగుతున్న విషయాలన్నీ విన్నారు. కావున వారు రాజభవనం నుండి బయటికి వచ్చారు. వారు దేవాలయానికి వెళ్లారు. అక్కడ దేవాలయానికి తిన్నగా వెళ్లే నూతన ద్వారం వద్ద తమ తమ స్థానాలను అలంకరించారు. 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.
12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే. 13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు. 14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి. 15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కాదు. మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చినది.”
16 తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పిన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.
17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు: 18 “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా(A) ఈ విషయాలు చెప్పియున్నాడు:
“సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది!
యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది!
గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ[c] పొదలతో నిండినట్లవుతుంది.
19 “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోషపరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”
20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు. 21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు. 22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు. 23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.
24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.
యెహోవా నెబుకద్నెజరును పాలకునిగా చేయుట
27 యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవత్సరం[d] జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు. 2 యోహోవా నాకు ఈ విధంగా చెప్పాడు. “యిర్మీయా! వారులతోను, నిలువు కట్టెతోను ఒక కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో. 3 తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను పంపు.[e] 4 ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ‘ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమంటే: మీ యాజమానులతో 5 నేనే భూమండలాన్ని, దానిపై ఉండే మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి పైగల జంతుజలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవనికైనా ఇచ్చి వేయగలను. 6 ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి లోబడి వుండేలా చేస్తాను. 7 దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు.
8 “‘కాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించవచ్చు.) అది గనుక జరిగితే, ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలితోను, రోగాలతోను శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను. 9 కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, “మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు” అని చెపుతారు. 10 కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.
11 “‘తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటువంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశంలోనే ఉండేలా చేస్తాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘ఆయా దేశాల వారంతా తమ తమ స్వదేశాలలోనే ఉంటూ. తమ భూముల్లో సేద్యం చేసుకుంటూ ఉంటారు.’”
12 యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: “సిద్కియా, బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బ్రతుకుతావు. 13 నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శత్రువు యొక్క కత్తివాత బడి, ఆకలితోను, భయంకర రోగాలతోను చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా చెప్పాడు! 14 కాని అబద్ధ ప్రవక్తలు మాత్రం, ‘నీవు బబులోను రాజుకు బానిసవు కానేరవు’ అని చెపుతున్నారు.
“ఆ ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే వారు నీకు అబద్దాలు చెపుతున్నారు. 15 ‘నేనా ప్రవక్తలను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు ‘వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున ఓ యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చనిపోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా చనిపోతారు.’”
16 అప్పుడు యిర్మీయానైన నేను యాజకులతోను, అ ప్రజలందరితోను ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్రవక్తలు, ‘బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వస్తువులు తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్రమే తిరిగి తీసుకొని రాబడుతాయి.’ అని చెపుతున్నారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ ప్రవచనాలను బోధిస్తున్నారు. 17 ఆ ప్రవక్తలు చెప్పే వాటిని మీరు వినవద్దు. బబులోను రాజుకు దాస్యంచేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్పించటం లేదు. 18 ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహోవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయనివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబులోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.
19 “సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచుకోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు సామగ్రి ఉంది.[f] బబులోను రాజైన నెబుకద్నెజరు వీటిని యెరూషలేములో వదిలి వేశాడు. 20 యూదా రాజైన యెహోయాకీనును[g] బందీగా కొనిపోయేటప్పుడు నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని పోలేదు. రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడు. యూదా నుండి, యెరూషలేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుకద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు. 21 దేవాలయంలోను, రాజభవనంలోను, మరియు యెరూషలేములోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘ఆ వస్తువులన్ని బబులోనుకు తీసుకొని పోబడతాయి. 22 నేను వాటిని తిరిగి తీసుకొని వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.’ ఇది యెహోవా వాక్కు. ‘పిమ్మట వాటిని నేను తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో వుంచుతాను.’”
అబద్ద ప్రవక్త హనన్యా
28 యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు[h] దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హనన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను. 3 రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. 4 యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను.’ ఇది యెహోవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’”
5 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు. 6 హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!
7 “కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి. 8 హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు. 9 కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”
10 యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు. 11 పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.”
హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.
12 తరువాత యెహోవా సందేశం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా విరచి వేసిన తరువాత ఇది జరిగింది. 13 యెహోవా యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు, నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.’ 14 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ దేశాలన్నిటిపైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బానిసలవుతారు. కృరమృగాలను కూడ అదుపులో పెట్టగల శక్తిని నెబుకద్నెజరుకు ప్రసాదిస్తాను.’”
15 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! యెహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేశావు. 16 అందువల్ల యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘హనన్యా, త్వరలో నిన్ను ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ సంవత్సరమే నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా నీవు బోధించావు గనుక.’”
17 హనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చనిపోయాడు.
బబులోనులో బంధీలకు ఉత్తరం
29 బబులోనులో బందీలుగా[i] వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే. 2 (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది) 3 బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.
4 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు. 5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి. 6 వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు. 7 నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.” 8 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు. 9 వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.
10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు. 14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు. 16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను. 17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను. 18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభవించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు. 19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు. 20 “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవలసిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”
21 సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. అప్పుడు నెబుకద్నెజరు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు. 22 యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’ 23 ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
షెమయాకు దేవుని సందేశం
24 షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు. 25 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు. 26 షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా[j] ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య[k] దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం[l] వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు. 27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు? 28 బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.’”
29 ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు. 30 పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. 31 “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు. 32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.’” ఇదే యెహోవా వాక్కు “‘ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.’”
© 1997 Bible League International