Chronological
యిర్మీయా నీళ్లగోతిలోనికి తోయబడటం
38 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు: 2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బ్రతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’ 3 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.’”
4 ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపరుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” అని చెప్పారు.
5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.
6 దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి[a] దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంతో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా)[b] రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు. 8-9 ఎబెద్మెలెకు ఇలా అన్నాడు: “నా ఏలినవాడవగు ఓ రాజా, ఆ అధికారులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ప్రవక్తయైన యిర్మీయా పట్ల వారు బహు క్రూరంగా వ్యవహరించారు. వారతనిని నీళ్లు నిలువజేసే గోతిలో పడవేశారు. అతనక్కడ చని పోయేలా వదిలి వేశారు.”[c]
10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు[d] మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలోనుండి పైకి తియ్యి.”
11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి క్రిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు. 12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కలుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు. 13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలో ఉన్నాడు.
యిర్మీయాను సిద్కియా కొన్ని ప్రశ్నలడగటం
14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.
15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.
16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు: “యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”
17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు. 18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.’”
19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.
20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పరు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది. 21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు: 22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు.
‘నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు.
నీవారు నీకంటె బలవంతులైనారు.
అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు.
నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి.
నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.’
23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”
24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు. 25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు. 26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి క్రిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ అని అన్నట్లు చెప్పు.”
27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్నించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.
28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.
యెరూషలేము పతనం
39 యెరూషలేము ఈ విధంగా లోబరచుకోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు. 2 సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది. 3 దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు. 5 కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు. 6 రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు. 7 తరువాత సిద్కియా కండ్లను నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.
8 బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు. 9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు. 10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.
11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 12 “యిర్మీయాను వెదకి తెలిసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
13 ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు. 14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు[e] అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.
ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం
15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది: 16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు. 17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను. 18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
యిర్మీయా విడుదల
40 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు. 2 దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు. 3 యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు. 4 కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబులోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు. 5 లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు.[f] యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.”
పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు. 6 కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.
గెదల్యా యొక్క స్వల్పకాలిక పాలన
7 యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు. 8 కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.
9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది. 10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”
11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు. 12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.
13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు. 14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.
15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదురై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”
16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.
ఆసాపు ధ్యాన గీతం.
74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
నరికే మనుష్యుల్లా ఉన్నారు.
6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
© 1997 Bible League International