Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ప్రకటన 4-8

యోహాను పరలోకాన్ని చూడటం

ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.

దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.

సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:

“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
    ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”

అని పాడుతూ ఉన్నాయి.

సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,

11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
    నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”

అని అన్నారు.

గ్రంథము, గొఱ్ఱెపిల్ల

ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.

అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు:

“నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి,
    ప్రతి దేశంనుండి,
ప్రతి గుంపునుండి,
    నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు.
    కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు.
    వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”

11 ఆ తర్వాత చూస్తే నాకు చాలమంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా,

“శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని,
    మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు”

అని పాడారు.

13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను:

“సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి,
    గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”

14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు.

ముద్రలు

ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.

ఆ గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను తీసినప్పుడు రెండవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అప్పుడు యింకొక గుఱ్ఱం వెలుపలికి వచ్చింది. అది ఎఱ్ఱటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకొనేటట్లు చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది.

ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను తీసినప్పుడు మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది. అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు; నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు!” అని అనటం వినిపించింది.

ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.”[b] మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది.

ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు. 10 వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. 11 ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.

12 ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది. 13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి.

15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. 16 వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్నవానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపంనుండి కాపాడండి. 17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.

దేవుని సేవకులు రక్షింపబడతారు

ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు. అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు.

ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.

యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

నఫ్తాలి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

మనష్షే గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

యోసేపు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి ముద్ర వేయబడింది.

ఒక పెద్ద ప్రజల గుంపు

దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.

11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”

13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.

14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.

“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”

ఏడవ ముద్ర

ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.

బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.

ఏడు బూరలు

ఏడు బూరలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు.

మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది.

రెండవ దేవదూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయ బడింది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది. సముద్రంలో ఉన్న ప్రాణులలో మూడవ భాగం చనిపోయాయి. మూడవ భాగం ఓడలు నాశనమయ్యాయి.

10 మూడవ దేవదూత తన బూర ఊదాడు. ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటల మీద పడింది. 11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి.[c] దానివల్ల మూడవ భాగం నీళ్ళు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు.

12 నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యునిలో మూడవ భాగము, చంద్రునిలో మూడవ భాగము, నక్షత్రాలలో మూడవ భాగము నాశనమయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. దాని మూలంగా దినంలో మూడవ భాగం, రాత్రిలో మూడవ భాగం చీకటితో నిండుకుపోయాయి.

13 నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో, “భూమ్మీద జనులకు శ్రమ! శ్రమ! శ్రమ! ఎందుకనగా ఇంకా ముగ్గురు దేవదూతలు ఊదబోతున్నారు” అని కేకలు వేయటం విన్నాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International