Add parallel Print Page Options

దేవుని వాహనం—యెహోవా సింహాసనం

ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది. దాని లోపల నాలుగు జంతువులు[a] ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది. కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు ప్రక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.

10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ ప్రక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గ్రద్ద ముఖం ఉంది. 11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని ప్రక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి. 12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి[b] ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు ప్రక్కకి తిరగలేదు.

13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది. 14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!

Read full chapter

Footnotes

  1. 1:5 జంతువులు జీవులు అని పాఠాంతరం.
  2. 1:12 గాలి లేక ఆత్మ.