Beginning
1 దైవేచ్ఛవల్ల యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పౌలు నుండి యేసుక్రీస్తును విశ్వసించే ఎఫెసులోని[a] పవిత్రులకు:
2 మన ప్రభువైన యేసు క్రీస్తు, మన తండ్రియైన దేవుడు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించు గాక!
క్రీస్తులో ఆత్మీయ దీవెనలు
3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి చెందిన మనకు ఆత్మీయతకు కావలసినవన్నీ మనలో క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. 4 మనము తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో మనల్ని తన ప్రేమవల్ల ఎన్నుకొన్నాడు. 5 యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! 6 కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమిస్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన దేవుణ్ణి మనము స్తుతించుదాం.
7 ఆయన రక్తం వల్ల మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. 8 ఆ అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. ఇది బాగా ఆలోచించి దివ్య జ్ఞానంతో చేసాడు. 9 ఆయన తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన మర్మాన్ని తన యిచ్ఛానుసారం మనకు తెలియచేసాడు. 10 సరియైన సమయం రాగానే తాను పూర్తి చేయదలచినదాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు.
11 అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణయించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము క్రీస్తులో ఐక్యత పొంది ఆయన ప్రజలుగా ఉండేటట్లు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. 12 క్రీస్తు మనకు రక్షణ యిస్తాడని విశ్వసించినవాళ్ళలో మనము మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను బట్టి ఆయన్ను స్తుతించుదాం. 13 మీరు రక్షణను గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై ముద్ర వేయబడింది. ఆ ముద్రే దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. 14 తన ప్రజలందరికీ రక్షణ కలిగే వరకూ వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్ధాత్మను మన దగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం జరిగింది.
పౌలు యొక్క ప్రార్థన
15 ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువుపట్ల ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసులపట్ల మీకున్న ప్రేమను గురించి విన్నప్పటినుండి 16 దేవునికి కృతజ్ఞతలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని తలుచుకోవటం మానలేదు. 17 నేను ఎల్లప్పుడు మన క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల తండ్రి మీకు పరిశుద్ధాత్మను యివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు.
18 మీ మనోనేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వారసత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన ఆశీస్సులు ఎంత అద్భుతమైనవో మీరు చూడగలుగుతారు. 19 క్రీస్తును విశ్వసించే మనలో పని చేస్తున్న ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన. 20 ఈ శక్తి ద్వారా క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకున్నాడు. 21 దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని హోదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తులకన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుతమున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదులకన్నా గొప్పది. 22 దేవుడు అన్నిటిని ఆయన పాదాల క్రింద ఉంచి, ఆయన్ని సంఘానికి సంబంధించిన వాటన్నిటిపై అధిపతిగా నియమించాడు. 23 సంఘము ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరిపూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరిపూర్ణత పొందుతుంది.
క్రీస్తులో పునర్జీవం
2 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. 2 అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. 3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.
4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. 5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. 6 మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. 7 యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.
8 మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. 9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము
11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
పౌలు యూదులు కానివాళ్ళకు బోధించుట
3 అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. 2 దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు. 3 ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను. 4 క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. 5 ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వికులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు తెలియచేసాడు. 6 ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలువాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.
7 దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. 8 దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. 9 అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. 10 భూమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. 11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. 12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. 13 మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International