Beginning
42 వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు. 2 వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము. 3 యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”
4 అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.”
5 తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు. 6 యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులమై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.”
7 పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. 8 అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. 9 అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు: 10 ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను—మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను. 11 బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు. 12 నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు.’ 13 ‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే. 14 ‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.’ 15 యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది: 16 మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు. 17 ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’
18 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’
19 “యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. 20 మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన దేవుని వద్దకు పంపారు. మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు. 21 కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు! 22 కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”
43 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగించాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు.
2 కాని హోషేయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకను మరికొంత మంది అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “యిర్మీయా నీవు అబద్ధమాడుతున్నావు! ‘ఓ ప్రజలారా, మీరు నివసించటానికి ఈజిప్టుకు వెళ్లరాదు’ అని మాకు చెప్పుమని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు. 3 యిర్మీయా, నేరియా కుమారుడైన బారూకు నిన్ను మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమనుకుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబులోనుకు పట్టుకుపోవాలని కోరుకొని వుండవచ్చు” అని అన్నారు.
4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు. 5 కాని ప్రభువాజ్ఞ పాటించటానికి బదులు, యోహానాను మరియు సైనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు ఇతర దేశాలకు తీసికొని వెళ్లాడు. కాని వారు మరల యూదా దేశానికి తిరిగి వచ్చారు. 6 ఇప్పుడు యోహానాను మరియు సైనికాధికారులు కలిసి పురుషులను, స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు కూడ వున్నారు. (నెబూజరదాను ఆ ప్రజలందరినీ గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూకును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు. 7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు[a] అనే పట్టణానికి వెళ్లారు.
8 తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ వర్తమానం యిర్మీయాకు చేరింది: 9 “యిర్మీయా, కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా, వాటిని తహపనేసులో ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, ఇటుకలతోను నిర్మించిన ప్రక్కబాట క్రింద పాతిపెట్టు. యూదా వారు చూస్తుండగా నీవీపని చేయ్యి. 10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు. 11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు 12 ఈజిప్టులోని బూటకపు దేవుళ్ల గుళ్లల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. అతడా గుళ్లను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్లులను, ముండ్ల కాయలను ఏరివేయునట్లు నెబుకద్నెజరు ఈజిప్టును శుభ్రపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత అతడు ఈజిప్టునుండి సురక్షితంగా వెళ్లిపోతాడు. 13 ఈజిప్టులో అతి ముఖ్యమైన సూర్య దేవాలయంలోని పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. పైగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయాలన్నిటినీ అతడు తగులబెడతాడు!’”
ఈజిప్టులోని యూదావారికి యెహోవా హెచ్చరిక
44 యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది: 2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి. 3 ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు. 4 ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపియున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు వారు ప్రజలకు చెప్పారు. 5 కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు. 6 కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.
7 “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు. 8 విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి. 9 మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా? 10 ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.”
11 “కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను! 12 యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు. 13 ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను. 14 యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’”
15 ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు: 16 “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం. 17 ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు. 18 కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”
19 తరువాత స్త్రీలు మాట్లాడారు.[b] వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.”
20 పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు. 21 ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు. 22 తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు. 23 అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో[c] మీ బాధ్యతను మీరు విస్మరించారు.”
24 తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి: 25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు పారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.’ 26 కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా, యెహోవా సందేశాన్ని వినండి: ‘మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా” అని వారు చెప్పరు. 27 ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకొనివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు. 28 కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు. 29 ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది. 30 నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరోహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు. ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’”
బారూకుకు ఒక వర్తమానం
45 యెహోయాకీము యోషియా కుమారుడు. యూదాలో రాజైన యెహోయాకీము పాలన నాల్గవ సంవత్సరం[d] జరుగుతూ ఉండగా ప్రవక్తయైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా కుమారుడైన బారూకుతో చెప్పాడు. బారూకు ఈ విషయాలను పుస్తక రూపంలో వ్రాశాడు. యిర్మీయా బారూకుకు చెప్పినది ఇది: 2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, 3 ‘బారూకూ, నీవిలా అన్నావు, “నాకు కష్టం వచ్చింది. నా బాధకు తోడు యెహోవా నాకు దుఃఖాన్ని యిచ్చాడు. నేను మిక్కిలి అలసిపోయాను. నా బాధలవల్ల నేను మిక్కిలి కృశించిపోయాను. నాకు విశ్రాంతి లేదు.” 4 యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను. 5 బారూకూ, నీవు నీ కొరకై గొప్ప విషయాలకై ఎదురు చూస్తున్నావా? నీవు వాటి కొరకు చూడవద్దు. ఎందుకంటే, నేను భయంకర విపత్తును ప్రజలందరి మీదికి కలుగజేస్తున్నాను గనుక నీవు వారి కొరకు చూడవద్దు.’ ఇవి యెహోవా చెప్పిన విషయాలు. ‘నీవు చాలా చోట్లకు వెళ్లవలసి వుంటుంది. నీవు ఎక్కడికి వెళ్లినా ప్రాణంతో తప్పించుకునేలా నేను చేస్తాను.’”
© 1997 Bible League International