Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 థెస్సలొనీకయులకు 1-3

పౌలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి:

మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక!

సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. మీ మధ్య ఉన్న ప్రేమ వర్ధిల్లుతోంది. కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతగా ఉండాలి. మీరు ఓర్పుతో సహిస్తున్న హింసలను గురించి, కష్టాలను గురించి విశ్వాసాన్ని గురించి మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ ఉంటాము.

దేవుని తీర్పు గూర్చి పౌలు చెప్పటం

దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్నదానికి ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టినవాళ్ళకు కష్టం కలిగిస్తాడు. ఆయన మనందరి కష్టాలు తొలిగిస్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి శక్తిగల దేవదూతలతో, అగ్నిజ్వాలలతో వచ్చినప్పుడు సంభవిస్తుంది. దేవుడు అంటే ఎవరో తెలియనివాళ్ళను, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించనివాళ్ళను ఆయన శిక్షిస్తాడు. వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, ఆయన గొప్పశక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై పోతారు. 10 ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందేవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.

11 ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలుపుకు తగినట్లు మీ జీవితాలను నడపమని మేము దేవుణ్ణి ప్రతిరోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి కోరికను, విశ్వాసంవల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్థిస్తూ ఉంటాము. 12 మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహిమలో భాగం కలగాలని మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన దేవుని అనుగ్రహంవల్ల, యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప వల్ల సంభవిస్తుంది.

పాప పురుషుడు

సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు. అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై ఆ భ్రష్టుడు తనను తాను హెచ్చించుకొంటూ మందిరంలో ప్రతిష్ఠించుకుని తానే దేవుణ్ణని ప్రకటిస్తాడు.

నేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా? ఆ భ్రష్టుని రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన సమయానికి రావాలని వాని రాక ఆపబడింది. వాని అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించేవాడు ఒకాయన ఉన్నాడు. వాణ్ణి అడ్డగిస్తున్నవాడు తీసివేయబడేదాకా ఆయన వాణ్ణి అడ్డగిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు వాణ్ణి తన ఊపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవంతంగా ప్రత్యక్షమై ఆ భ్రష్టుణ్ణి నాశనం చేస్తాడు.

ఆ భ్రష్టుడు సాతాను శక్తితో వచ్చి రకరకాల మహత్కార్యాలు చేస్తాడు. దొంగ చిహ్నాలు, అద్భుతాలు చేసి మోసం చేస్తాడు. 10 నాశనం కానున్నవాళ్ళను అన్ని విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని ప్రేమించటానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు కనుక నశించిపోతారు. 11 ఈ కారణంగా దేవుడు వాళ్ళకు మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ముతారు. 12 సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించాలని నిశ్చయించుకొన్నవాళ్ళందరినీ శిక్షిస్తాడు.

బలంగా నిలబడండి

13 సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు. 14 మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. 15 సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధ ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్ఠతో అనుసరించండి.

16 యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు. 17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!

మా కోసం ప్రార్థించండి

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే మా కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి. విశ్వాసం అందరిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల నుండి మేము రక్షింపబడాలని ప్రార్థించండి.

కాని ప్రభువు నమ్మతగినవాడు. కనుక ఆయన మిమ్మల్ని సాతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు. మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ పాటిస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం మాకు ప్రభువు వల్ల కలిగింది. తండ్రియైన దేవునిలో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో నింపబడాలని మా అభిలాష.

పని చెయ్యటం మీ కర్తవ్యం

సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము ఆజ్ఞాపిస్తున్నదేమనగా, మా నుండి విన్న క్రీస్తు సందేశం ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరునితో సాంగత్యం చెయ్యకండి. మమ్మల్ని అనుసరించాలని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు సోమరులంగా ఉండలేదు. అంతేకాక మేము ఎవరి ఇంట్లోనైనా ఊరికే భోజనం చేయలేదు. మీలో ఎవ్వరికీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసాము. మీ నుండి అలాంటి సహాయం కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేసాము. 10 మేము మీతో ఉన్నప్పుడే, “మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” అని చెప్పాము.

11 మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు పని చెయ్యకపోవటమే కాకుండా ఇతరుల విషయంలో జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12 వాళ్ళు ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. 13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి.

14 ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా పాటించకపోతే అలాంటివాళ్ళను ప్రత్యేకంగా గమనించండి. అలాంటివాణ్ణి సిగ్గుపడేటట్లు చెయ్యటానికి అతనితో సాంగత్యం చేయకండి. 15 అయినా అతణ్ణి శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి వారించండి.

చివరి మాట

16 శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక!

17 పౌలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్ధతి.

18 మన యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International