Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 38

జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.

38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
    నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
యెహోవా, నీవు నన్ను బాధించావు.
    నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
    నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
    ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
నేను తెలివితక్కువగా ఉన్నాను.
    ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
    రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
నా నడుము వేడిగా కాలిపోతోంది.
    నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
    నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
    నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
    నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
    నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
    నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
    నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
    మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
    నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
    నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
    నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
    నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
    నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
    వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
    నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
    కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
    నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
    నా దేవా, నన్ను రక్షించుము.

కీర్తనలు. 119:25-48

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

విలాప వాక్యములు 2:8-15

సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను
    కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు.
ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు.
    దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు.
కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు.
    అవి ఒక్కుమ్మడిగా శిథిలమై పోయాయి.

యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి.
    ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు.
ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు.
    వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు.
యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి
    దర్శనాలు ఏమీలేవు.

10 సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు.
    వారు కింద కూర్చుండి మౌనం వహించారు.
వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు.
    వారు గోనెపట్ట కట్టుకున్నారు.
యెరూషలేము యువతులు దుఃఖంతో
    తమ తలలు కిందికి వంచుకున్నారు.

11 కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి!
    నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది!
నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది!
    నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది.
పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో
    మూర్ఛపోతున్నారు.
12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?”
    అని ఆ పిల్లలు తమ తల్లులను అడుగుతున్నారు.
వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు.
    వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
13 సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను?
    నిన్ను దేనితో పోల్చాలి?
సీయోను కుమారీ, నిన్ను దేనితో పోల్చను?
    నిన్నెలా ఓదార్చగలను?
నీ వినాశనం సముద్రమంత పెద్దది!
    ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.

14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు.
    కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు.
పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు.
    పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నమూ చేయలేదు.
వారు నీకొరకు ఉపదేశాలు అందించారు.
    కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.

15 మార్గమున పోవు వారు నిన్ను చూసి
    విస్మయంతో చేతులు చరుస్తారు.
యెరూషలేము కుమార్తెను చూచి
    వారు ఈలవేసి తలలు ఆడిస్తారు.
“‘అపురూప అందాల నగరం’ అనీ,
    ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని
    ‘ప్రజలు పిలిచే నగరం ఇదేనా’?” అని వారడుగుతారు.

1 కొరింథీయులకు 15:51-58

51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. 52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. 53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. 54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది:

“మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”(A)

55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”(B)

56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. 57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.

58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.

మత్తయి 12:1-14

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మార్కు 2:23-28; లూకా 6:1-5)

12 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు. పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.

3-4 యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు. అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు. నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ‘నాకు దయకావాలి, బలికాదు’(A) అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.

“విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మార్కు 3:1-6; లూకా 6:6-11)

ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. 10 అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.

11 ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? 12 మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.

13 అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది. 14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International