Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

2 రాజులు 20

హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుట

20 ఆ సమయమున, హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందునంతగా వ్యాధిగ్రస్తుడైనాడు. ఆమోజు కుమారుడు “యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్లి, ‘నీ ఇంటిని సరిదిద్దుకో. ఎందుకంటే నీవు మరణిస్తావు. నీవు బ్రతకవు’ అని యెహోవా చెప్పుచున్నాడని చెప్పెను.”

హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు. “యెహోవా, నిన్ను నేను హృదయస్ఫూర్తిగా సేవించానని జ్ఞాపకము చేసుకో. నీవు మంచివని చెప్పిన పనులు నేను చేశాను” అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు.

యెషయా తన మధ్యగది విడిచి వెళ్లడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది. నా మనుష్యులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్లి అతనితో చెప్పు. మీ పూర్వికులైన దావీదు యొక్క యెహోవా దేవుడనైన నేను, “నీ ప్రార్థన ఆలకించాను. నీ కన్నీళ్లు చూశాను. అందువల్ల నీ రోగమును నయము చేస్తాను. మూడవ రోజున, నీవు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లుము. నేను నీ జీవితానికి పదునైదుయేండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడతాను. అష్షూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడతాను. నేనిది నా కోసము చేస్తున్నాను. ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకి వాగ్దానం చేశాను కనుక” అని పలికెను.

తర్వాత యెషయా, “అంజూరపు పట్టీ చేసి, దానిని పుండుపై వుంచుము” అన్నాడు.

అందువల్ల వారు అంజూరపు పట్టీ చేసి, దానిని హిజ్కియా పుండుపై వుంచారు. తర్వాత హిజ్కియా స్వస్థపడెను.

హిజ్కియా యెషయాతో, “యెహోవా నాకు నయం చేసే సంకేతము ఏమిటి? మూడో రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్లడానికి సంకేత మేమిటి?” అని అడిగాడు.

“నీ కేది కావాలి? నీడ పది అడుగులు ముందుకి పోవలెనా లేక పది అడుగులు వెనుకకు పోవలెనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పినది చేసేందుకు సంకేతము” అని యెషయా చెప్పాడు.

10 హిజ్కియా, “నీడ పది అడుగులు క్రిందికి వెళ్లడం, నీడకు చాలా సులభమైనది లేదు. నీడని పది అడుగులు వెనుకకు మరల్చుము” అని బదులు చెప్పాడు.

11 తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు. మరియు యెహోవా నీడను పదిమెట్లు వెనుకకు మరలునట్లు చేసెను. అది పూర్వము వున్నట్లుగా, మెట్ల మీద వెనుకకు పోయింది.

బబులోను నుంచి వచ్చిన వార్తాహరులు

12 ఆ సమయమున, బలదాను కొడుకైన మెరోదక్బలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. మెరోదక్బలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా వ్యాధిగ్రస్తుడైవున్నాడని విన్నందువల్లనే. 13 హిజ్కియా బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానించాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదైన పరిమళ తైలము, ఆయుధాలు, మొదలైన వాటిని చూపించాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు.

14 తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగాడు.

“వారు చాలా దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు.

15 “వారు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని యెషయా అడిగినాడు.

“వారు మా ఇంట అన్నీ చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” అని హిజ్కియా సమాధానమిచ్చాడు.

16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను. 17 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీపూర్వికులు సమకూర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబడతాయి. ఏమియు మిగలదని యెహోవా చెబుతున్నాడు. 18 బబులోను వారు నీ కుమారులను తీసుకుపోతారు. మరియు నీ కుమారులు బబులోను రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.”

19 అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవితకాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా మంచిది.”

20 హిజ్కియా చేసిన అన్ని సత్కార్యములు, నగరంలోకి నీళ్లు రావడానికి గాను అతను జలాశయము, సొరంగ కాలువను నిర్మించినది, కాలువలు వేయించినది కూడా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. హిజ్కియా మరణించగా, 21 అతని పూర్వికులతో పాటుగా, అతనిని సమాధి చేశారు. మరియు హిజ్కియా కుమారుడు మనష్షే అతని తర్వాత క్రొత్తగా రాజ్యయ్యాడు.

అపొస్తలుల కార్యములు 12:1-17

హింసలు

12 ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు. అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు. ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది. అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం. పేతురును అంతవరకు కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందినవాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.

ప్రభువు దూత పేతురును విడిపించటం

హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంట రా!” అని ఆ దూత అన్నాడు.

పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు. 10 వాళ్ళు మొదటి కాపలావాణ్ణి, రెండవ కాపలావాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు.

11 అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధంనుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదులనుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు.

12 జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు. 13 పేతురు తలుపు తట్టాడు. “రొదే” అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. 14 ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది. 15 వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు.

16 పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. 17 పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారంనుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబుకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.

లూకా 7:11-17

చనిపోయిన వాణ్ణి బ్రతికించటం

11 ఆ తర్వాత యేసు నాయీను అనే పట్టణానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, చాలా మంది ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. 12 ఆయన ఆ పట్టణం యొక్క ముఖ్య ద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకొని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు. తల్లి వితంతువు. ఆ వూరి వాళ్ళు అనేకులు ఆమె వెంటవున్నారు. 13 ఆమెను చూసి ప్రభువు హృదయం కరిగి పోయింది. ఆయన ఆమెతో, “దుఃఖించకమ్మా” అని అన్నాడు. 14 ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. పాడె మోసుకు వెళ్తున్న వాళ్ళు కదలకుండా ఆగిపోయారు. యేసు, “బాబూ! లెమ్మని నీతో చెబుతున్నాను!” అని అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు అతణ్ణి అతని తల్లికి అప్పగించాడు.

16 వాళ్ళందరిలో భక్తి, భయము నిండుకు పోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు, “ఒక గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు” అని అన్నారు.

17 యేసును గురించి యూదయ ప్రాంతంలోను, దాని చుట్టూవున్న ప్రాంతాల్లోను తెలిసిపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International