Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 120-127

యాత్ర కీర్తన.

120 నేను కష్టంలో ఉన్నాను.
    సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
    ఆయన నన్ను రక్షించాడు.
యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
    నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.

అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
    మీరేమి పొందుతారో మీకు తెలుసా?
మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
    మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.

అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
    అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.

యాత్ర కీర్తన.

121 కొండల తట్టు నేను చూసాను.
    కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
    నాకు సహాయం వస్తుంది.
దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
    నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
    దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
    యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
    రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
    యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
    ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.

దావీదు యాత్ర కీర్తన.

122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
    నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కొత్త యెరూషలేము
    ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
    యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
    దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
    “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
    నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
    నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
    శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
    ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

యాత్ర కీర్తన.

123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
    నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
    బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
    దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
యెహోవా, మా మీద దయ చూపించుము.
    మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
    మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

యాత్ర కీర్తన.

126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
    తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
మేము నవ్వుకుంటున్నాము.
    మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
    “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!

యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
    ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
    కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
    కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

సొలొమోను యాత్ర కీర్తన.

127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
    కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
    కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.

నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
    నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
    వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.

పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
    వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[b] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.

2 రాజులు 22:1-13

యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట

22 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె. యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.

ఆలయ మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట

యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు. “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు. యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి. పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.

ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట

ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.

కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు. 10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.

11 రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలు వినగానే, తాను తలక్రిందులైనాననీ, విచారం చెందినాననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపుకొన్నాడు. 12 తర్వాత రాజు యాజకుడు హిల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమారుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ ఇచ్చాడు. 13 యోషీయా రాజు, “వెళ్లి మనమేమి చేయాలో యెహోవాని అడుగు. నా కోసము, ప్రజల కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీకులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడంవల్ల. మనకోసము వ్రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము పాటించలేదు” అని చెప్పాడు.

1 కొరింథీయులకు 11:2

ఆరాధనా, పవిత్రత—తలపై ముసుగు

నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

1 కొరింథీయులకు 11:17-22

ప్రభువు భోజనం

17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. 18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. 19 సక్రమ మార్గాల్లో నడుచుకొనేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.

20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు. 21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. 22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.

మత్తయి 9:1-8

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మార్కు 2:1-12; లూకా 5:17-26)

యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.

ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.

వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International