లూకా 6:6-11
Telugu Holy Bible: Easy-to-Read Version
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)
6 మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. 7 పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 8 యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. 9 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.
10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.
Read full chapter© 1997 Bible League International