Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
    వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
    కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
    ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
    వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
    కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
    కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
    వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
    ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
    మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
    మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
    మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
    అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
    కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
    వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
    అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
    అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.

32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
    మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
    మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
    దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
    మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.

35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
    వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
    నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
    సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
    వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
    నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
    నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.

1 సమూయేలు 20:24-42

24 అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు.

విందులో సౌలు వైఖరి

అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు. 25 మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. 26 ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి[a] ఉండవచ్చు” అనుకున్నాడు.

27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.

28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దావీదు నన్ను అడిగాడు. 29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.

30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. 31 యెష్షయి కుమారుడు బ్రతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.

32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.

33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది. 34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనం చేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.

యోనాతాను, దావీదు వీడ్కోలు చెప్పుకోవడం

35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. 36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 37 బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. 38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. 39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. 40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు.

41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.

42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.

అపొస్తలుల కార్యములు 13:1-12

బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం

13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.

అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.

సైప్రసులో

పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.

వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్‌ యేసు,” అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.

తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.

మార్కు 2:23-3:6

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; లూకా 6:1-5)

23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.

27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; లూకా 6:6-11)

ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.

అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.

ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International