Book of Common Prayer
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
సహనము
7 అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. 8 ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. 9 సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.
10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి.
అయిదవ భాగం
(కీర్తనలు 107–150)
107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
4 ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
5 ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
బలహీనం అయ్యారు.
6 అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
7 ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
8 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి!
ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
9 దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు.
ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో
బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు.
11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు.
సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా
దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు.
వారు తొట్రిల్లి, పడిపోయారు.
మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు.
వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు.
మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము.
వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు.
వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.
17 కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు.
మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు,
వారు చావుకు సమీపించారు.
19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు.
కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి.
యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
క్రొత్త యెరూషలేము
21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము.
© 1997 Bible League International