Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

కీర్తనలు. 32

దావీదు దైవధ్యాన కీర్తన.

32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
    తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
    తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.

దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
    కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
    నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
    తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
    కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
    నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
    మరియు నీవు నా పాపాలను క్షమించావు.
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
    కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
    నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
    నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
    నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
    నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
    ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
    కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

కీర్తనలు. 42-43

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

1 సమూయేలు 22

దావీదు పలుచోట్లకు వెళ్లుట

22 దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు. చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిపి వారు మొత్తం నాలుగు వందలమంది.

దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు. దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో[a] దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.

గాదు ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, యూదాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయల్దేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు.

అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట

దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింది అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది. సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరనుకుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు. మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.

ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలెకును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను. 10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.

11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు. 12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు.

“చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.

13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.

14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. 15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.

16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు. 17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు.

రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు. 18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు. 19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.

20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు. 21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు. 22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను. 23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.

అపొస్తలుల కార్యములు 13:26-43

26 “సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు. 27 కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు. 28 ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించమని పిలాతును కోరారు.

29 “లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు. 30 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. 31 ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యెరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు.

32 “వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది:

‘నీవు నా కుమారుడవు!
    నేడు నేను నీకు తండ్రినయ్యాను.’(A)

34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట,

‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’(B) అని అన్నాడు.

35 మరొక చోట యిలా చెప్పబడింది:

‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’(C)

36 “దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వికులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది. 37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు. 38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి, 39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు. 40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి:

41 ‘పరిహాసం చేసే ప్రజలారా!
    ఆశ్చర్యం పొందండి! నశించకండి!
ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది
    నేనొకటి చేయబోతున్నాను!
మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’”(D)

42 పౌలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని గురించి యింకా ఎక్కువగా మాట్లాడండని ప్రజలు అడిగారు. 43 ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబా ప్రజలతో, “దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ ఉండండి!” అని చెప్పారు.

మార్కు 3:19-35

19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.

యేసుని శక్తి దేవునినుండి వచ్చినది

(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)

20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.

22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.

23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.

27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.

28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”

30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.

యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు

(మత్తయి 12:46-50; లూకా 8:19-21)

31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.

33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International