Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 120-127

యాత్ర కీర్తన.

120 నేను కష్టంలో ఉన్నాను.
    సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
    ఆయన నన్ను రక్షించాడు.
యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
    నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.

అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
    మీరేమి పొందుతారో మీకు తెలుసా?
మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
    మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.

అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
    అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.

యాత్ర కీర్తన.

121 కొండల తట్టు నేను చూసాను.
    కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
    నాకు సహాయం వస్తుంది.
దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
    నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
    దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
    యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
    రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
    యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
    ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.

దావీదు యాత్ర కీర్తన.

122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
    నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కొత్త యెరూషలేము
    ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
    యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
    దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
    “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
    నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
    నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
    శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
    ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

యాత్ర కీర్తన.

123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
    నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
    బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
    దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
యెహోవా, మా మీద దయ చూపించుము.
    మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
    మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

యాత్ర కీర్తన.

126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
    తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
మేము నవ్వుకుంటున్నాము.
    మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
    “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!

యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
    ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
    కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
    కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

సొలొమోను యాత్ర కీర్తన.

127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
    కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
    కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.

నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
    నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
    వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.

పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
    వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[b] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.

1 సమూయేలు 11

11 ఒకనెల గడిచింది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.

“మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.

అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.

సౌలు యాబేషు గిలాదును రక్షించుట

వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు. సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు.

అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు. అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది. సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకొని, వాటిని నరికి ముక్కలు చేసి, వాటిని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి, వాటిని ఇశ్రాయేలు నలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. వార్తాహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ “సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.”

యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు. సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.

“గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు.

సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు. 10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.

11 అ మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.

12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.

13 “వద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.

14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.

15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 8:1-13

1-3 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు.

సౌలు సంఘాన్ని హింసించటం

ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇలా చెదిరిపోయినవాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.

సమరయలో ఫిలిప్పు

ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు. 6-7 ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టినవాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టినవాళ్ళనుండి దయ్యాలు పెద్ద కేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు. ఆ పట్టణంలో ఉన్నవాళ్ళందరూ ఆనందించారు.

సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలంనుండి మంత్రతంత్రాలు చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్పవాణ్ణని చెప్పుకొనేవాడు. 10 చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే, ఆ దైవికమైన శక్తి అతనిలో ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు. 11 అతడు వాళ్ళను తన మంత్రతంత్రాలతో చాలాకాలంనుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు. 12 కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు. 13 సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహత్యాల్ని, అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.

లూకా 22:63-71

భటులు యేసును హేళన చెయ్యటం

(మత్తయి 26:67-68; మార్కు 14:65)

63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. 65 అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు.

మహాసభ సమక్షంలో యేసు

(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; యోహాను 18:19-24)

66 సూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు సమావేశమయ్యారు. వాళ్ళు యేసును మహాసభ ముందుకు పిలుచుకు వచ్చారు. 67 మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువైనట్లైతే మాతో చెప్పు” అని అన్నారు.

యేసు, “నేను చెబితే మీరు నమ్మరు. 68 నేను అడిగితే మీరు చెప్పరు. 69 కాని యిప్పటినుండి మనుష్య కుమారుడు సర్వశక్తిసంపన్నుడైన దేవుని యొక్క కుడివైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు.

70 వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు.

71 ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International