Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 102

శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది.

102 యెహోవా, నా ప్రార్థన విను.
    సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము.
    నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది.
    నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
నా బలం పోయింది.
    నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
    నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.[a]
అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
    శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
నేను నిద్రపోలేను.
    పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు.
    నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
నా అధిక విచారమే నా భోజనం.
    నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
10 ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు.
    యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను క్రిందకు విసిరేశావు.

11 సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది.
    నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను.
12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
    నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.
    నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది.
14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.
    దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.
    యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.
    దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
18 రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు.
    అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
19 యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు.
    యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు.
20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు.
    మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు.
వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు.
22     జనసమూహములు కలిసి పోగుచేయబడునప్పుడు
    రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.

23 నాలో బలం పోయింది.
    నా జీవితం తక్కువగా చేయబడింది.
24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు.
    దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు.
    ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి.
    కాని నీవు శాశ్వతంగా జీవిస్తావు.
అవి బట్టల్లా పాడైపోతాయి.
    మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు.
    నీవు శాశ్వతంగా జీవిస్తావు!
28 ఈ వేళ మేము నీ సేవకులము.
    భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు.
    మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”

కీర్తనలు. 107:1-32

అయిదవ భాగం

(కీర్తనలు 107–150)

107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
    ఆయన ప్రేమ శాశ్వతం.
యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
    వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
    తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.

ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
    వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
    కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
    బలహీనం అయ్యారు.
అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
    యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి!
    ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో
    బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు.
11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు.
    సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా
    దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు.
వారు తొట్రిల్లి, పడిపోయారు.
    మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు.
    వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు.
    మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము.
వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు.
    వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.

17 కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు.
    మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు,
    వారు చావుకు సమీపించారు.
19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
    యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు.
    కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి.
    యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.

23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
    వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
    సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
    అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27     ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
    నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
    మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
    అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
    వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
    ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
    పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.

న్యాయాధిపతులు 14:20-15

20 సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.

సమ్సోను ఫిలిష్తీయులకు కష్టాలు కలిగించుట

15 గోధుమ పంట కోతల సమయంలో, సమ్సోను తన భార్యను చూడటానికి వెళ్లాడు. ఆమెకు కానుకగా ఒక పిల్ల మేకను తీసుకు వెళ్లాడు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య గదికి వెళ్తున్నాను.”

కాని ఆమె తండ్రి సమ్సోనుని లోపలికి వెళ్లనీయలేదు. ఆమె తండ్రి సమ్సోనుతో ఇలా అన్నాడు; “ఆమెను నీవు ద్వేషించినట్లు భావించాను. అందువల్లనే వివాహమునకు వచ్చిన తోడి పెండ్లి కుమారుడ్ని వివాహము చేసుకోమన్నాను. ఆమె చిన్న చెల్లెలు చాలా సౌందర్యవతి. ఆ చిన్న చెల్లెలిని తీసుకువెళ్లు”

కాని సమ్సోను అతనితో ఇలా అన్నాడు; “మీ ఫిలిష్తీయులను బాధించేందుకు తగిన కారణం ఇప్పుడు నాకు కనిపించింది. ఇప్పుడు నన్నెవ్వరూ నిందించరు.”

అందువల్ల సమ్సోను బయటికి వెళ్లి మూడు వందల నక్కల్ని పట్టుకున్నాడు. ఒకేసారి రెండేసి నక్కల్ని తీసుకుని వాటి తోకల్ని జతలు జతలుగా కట్టివేశాడు. ప్రతి రెండు నక్కల తోకలకు మధ్య ఒక దివిటీ కట్టి వేశాడు. తరువాత నక్కల తోకల మధ్య ఉన్న దివిటీలు వెలిగించాడు. ఆ తర్వాత ఫిలిష్తీయుల ధాన్యపు రాసుల గుండా నక్కల్ని పరుగెత్తనిచ్చాడు. ఆ విధంగా, అతను వారి పొలాలలో పెరిగిన మొక్కల్నీ, కోసిపెట్టిన ధాన్యపు రాసుల్నీ కాల్చివేశాడు. అతను వాళ్ల ద్రాక్ష తోటల్ని, వాళ్ల ఒలీవ చెట్లని కూడా కాల్చివేశాడు.

“ఈ పని ఎవరు చేశారు?” అని ఫిలిష్తీయులు అడిగారు.

ఎవరో ఇలా చెప్పారు: “తిమ్నాతుకు చెందిన ఆ మనిషియొక్క అల్లుడైన సమ్సోను ఈ పనిచేశాడు. అతను ఈ విధంగా ఎందుకు చేశాడంటే, అతని మామగారు సమ్సోను భార్యని పెళ్లిలోని అతని స్నేహితునికి ఇచ్చివేశాడు.” అందువల్ల సమ్సోను భార్యనీ, ఆమె తండ్రినీ ఫిలిష్తీయులు కాల్చి వేశారు.

అప్పుడు ఫిలిష్తీయులను ఉద్దేశించి సమ్సోను ఇలా అన్నాడు; “మీరు నాకు ఈ విధంగా కీడు చేశారు. అందువల్ల మీకు ఇప్పుడు నేను కీడు చేస్తాను. అప్పుడు నేను మీమీద పగతీర్చుకోవడం మానేస్తాను.”

తర్వాత సమ్సోను ఫిలిష్తీయుల మీద దాడిచేశాడు. చాలా మందిని చంపివేశాడు. తర్వాత అతను వెళ్లి ఒక గుహలో నివసించెను. ఏతాము బండ అనే ప్రదేశంలో ఆ గుహ ఉన్నది.

అప్పుడు ఫిలిష్తీయులు యూదా ప్రాంతానికి తరలిపోయారు. లేహీ అనే చోట వారు నిలిచారు. వారి సైనికులు అక్కడ విడిదిచేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. 10 యూదా వంశానికి చెందిన మనుష్యులు వారిని ఇలా ప్రశ్నించారు: “ఫిలిష్తీయులైన మీరు మాతో యుద్ధం చేసేందుకు ఎందుకు ఇక్కడికి వచ్చారు?”

అందుకు వారు ఇలా అన్నారు: “మేము సమ్సోనును పట్టుకోడానికి వచ్చాము. అతనిని మేము మా బందీగా చేసుకోవడానికి వచ్చాము. అతను మా ప్రజలకి చేసిన పనులకు బదులుగా అతనిని శిక్షిస్తాము.”

11 అప్పుడు యూదా వంశస్థులైన మూడువేల మంది మనుష్యులు సమ్సోనును పట్టుకొనుటకు ఏతాము బండకి దగ్గరగా వున్న ఆ గుహ వద్దకు వెళ్లి. అతనితో ఇలా అన్నారు: “నీవు మాకేమి చేశావు? ఫిలిష్తీయులు మమ్మల్ని పరిపాలిస్తున్నారని నీకు తెలియదా?”

“వారు నాకు చేసిన కీడుకు బదులుగా వారిని నేను శిక్షించాను.” అని సమ్సోను సమాధానం చెప్పాడు.

12 అప్పుడు వారు సమ్సోనుతో ఇలా అన్నారు: “మేము నిన్ను బంధించడానికి వచ్చాము. మేము నిన్ను ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము.”

యూదా నుండి వచ్చిన మనుష్యులతో సమ్సోను ఇలా అన్నాడు: “మీరు నాకు ఏమీ అపకారం చేయమని నాకు మాట ఇవ్వాలి.”

13 యూదా నుండి వచ్చిన మనుష్యులు ఇలా అన్నారు: “అందుకు మేము సమ్మతిస్తున్నాము. మేము నిన్ను బంధించి, ఫిలిష్తీయులకు అప్పజెప్పుతాము. మేము నిన్ను చంపమని మాట ఇస్తున్నాము.” అప్పుడు వారు రెండు కొత్త తాళ్లతో సమ్సోనును బంధించారు. ఆ ప్రాంతంలోని గుహనుంచి అతనిని తీసుకువెళ్లారు.

14 లేహీ అనే చోటికి సమ్సోను రాగానే, ఫిలిష్తీయులు అతనిని కలుసుకోడానికి అక్కడికి వచ్చారు. సంతోషంతో వారు కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనును నింపగా, సమ్సోను తాళ్లు తెంపుకున్నాడు. కాలిపోయిన దారంవలె ఆ తాళ్లు బలహీనముగా కనిపించాయి. కరిగిపోయినట్లుగా ఆ తాళ్లు సడలిపోయాయి. 15 సమ్సోను చచ్చిపోయిన ఒక గాడిద దవడ ఎముకను చూశాడు. అతను ఆ దవడ ఎముకను తీసుకున్నాడు. దానితో వేయి మంది ఫిలిష్తీయుల్ని చంపివేశాడు.

16 తర్వాత సమ్సోను అన్నాడు:

“గాడిద దవడ ఎముకతో
    వెయ్యి మందిని చంపాను!
గాడిద దవడ ఎముకతో
    వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”

17 సమ్సోను ఈలాగు చెప్పిన తర్వాత, ఆ దవడ ఎముకను అతడు క్రిందికి విసరివేశాడు. అందువల్ల ఆ ప్రదేశానికి రామత్లేహీ[a] అనే పేరు వచ్చింది.

18 సమ్సోనుకు బాగా దాహం వేసింది. అందువల్ల అతను యెహోవాను ఉద్దేశించి కేకపెట్టాడు. అతను అన్నాడు: “నేను నీ భక్తుడను. నీవు నాకు మహా విజయం సమకూర్చావు. ఇప్పుడు దప్పిక బాధతో నన్ను మరణం పాలుచేయవద్దు. సున్నతి కూడా చేసుకోని మనుష్యులకు నన్ను పట్టుబడకుండా చెయ్యి”

19 లేహీలోని నేలలో ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం బద్దలయ్యేలా దేవుడు చేసెను. నీళ్లు వెలికి వచ్చాయి. ఆ నీటిని సమ్సోను తాగి, హాయిపొందాడు. అతను మళ్లీ బలవంతుడయ్యాడు. అందువల్ల అతను ఆ నీటి బుగ్గకి ఎన్ హకోరె[b] అని పేరు పెట్టాడు. నేటికీ లేహీ నగరంలో అది ఉంది.

20 ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలపాటు వ్యవహరించాడు. ఇది ఫిలిష్తీయులు నివసించిన కాలంలో జరిగింది.

అపొస్తలుల కార్యములు 7:17-29

17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.

20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. 22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.

23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. 24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.

26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. 27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? 28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. 29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.

యోహాను 4:43-54

రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం

(మత్తయి 8:5-13; లూకా 7:1-10)

43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు. 44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు. 45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.

46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.

49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.

50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.

అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.

52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.

వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.

53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.

54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International