Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

కీర్తనలు. 109:1-30

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

న్యాయాధిపతులు 13:15-24

15 అప్పుడు ఆ యెహోవాదూతతో మానోహ ఇలా చెప్పాడు: “దయచేసి నీవు మాతోపాటు కొంత సేపు ఉండు. నీవు తినేందుకుగాను ఒక లేత మేకను వండిపెట్టాలని అనుకుంటున్నాము.”

16 యెహోవాదూత మానోహతో ఇలా అన్నాడు: “నేను వెళ్లకుండా మీరు చేసినా, నేను మీరు పెట్టే ఆహారం తినను. కాని మీరేదైనా చెయ్యదలుచుకుంటే, అప్పుడు యెహోవాకు దహనబలిని సమర్పించండి.” (ఆ వ్యక్తి నిజంగా యెహోవాదూత అని మానోహ అర్థం చేసుకోలేక పోయాడు).

17 అప్పుడు యెహోవాదూతను, “నీ పేరేమిటి? నీవు చెప్పినదంతా నిజంగా జరిగినప్పుడు, నిన్ను గౌరవించాలని మేమనుకుంటున్నాము. అందువల్లనే నీ పేరు తెలుసుకోదలచాను.”

18 యెహోవాదూత ఇలా చెప్పాడు: “నా పేరు మీరెందుకు అడుగుతున్నారు? ఇది మీరు నమ్మడానికి చాలా ఆశ్చర్యకరము”

19 అప్పుడు మానోహ ఒక బండ మీద ఒక లేత మేకను బలి ఇచ్చాడు. మేకను, ధాన్యమును యెహోవాకు, మరియు అద్భుతాలు చేసే వ్యక్తికీ సమర్పించాడు. 20 మానోహ, అతని భార్య జరిగిన వాటిని గమనిస్తూ వచ్చారు. మధ్యస్థానము నుండి ఆకాశానికి పొగలు లేచినప్పుడు, యెహోవాదూత ఆ మంటలలో పరమునకు వెళ్లిపోయాడు!

ఎప్పుడైతే అది మానోహ, అతని భార్య చూసారో, నేలకు తాకేలా తమ ముఖాలు వంచి నమస్కరించారు. 21 ఆ వ్యక్తి నిజంగానే యెహోవాదూత అని చివరికి మానోహ గ్రహించాడు. ఆ తర్వాత యెహోవాదూత మళ్లీ మానోహ, మరియు ఆయన భార్య ముందు ప్రత్యక్షం కాలేదు. 22 మానోహ తన భార్యతో ఇలా అన్నాడు: “మనం దేవుణ్ణి చూశాము. అందువల్ల తప్పకుండా మనం మరణిస్తాము!”

23 కాని అతని భార్య అతనితో, “మనల్ని చంపాలని దేవుడు భావించడం లేదు. యెహోవా కనుక మనల్ని చంపదలచుకుంటే, మనం సమర్పించిన వండిన వస్తువుని, ధాన్యాన్ని ఆయన స్వీకరించి ఉండడు. మనకీ విషయాలను ఆయన చూపివుండడు. పైగా వీటిని మనకు చెప్పి ఉండడు.” అని చెప్పింది.

24 తరువాత ఆ స్త్రీకి బాలుడు జన్మించాడు. అతనికి సమ్సోను అని పేరు పెట్టింది. సమ్సోను పెరిగాడు. యెహోవా అతనిని ఆశీర్వదించాడు.

అపొస్తలుల కార్యములు 6

ఏడుగురిని ఎన్నుకోవటం

యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.

అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”

అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.

దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.

స్తెఫనును బంధించటం

దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. 10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.

11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. 12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

13-14 తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. 15 సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.

యోహాను 4:1-26

యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం

యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు. యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు. ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.

ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.

ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.

10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.

11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? 12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.

13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! 14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.

15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.

16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.

17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.

యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.

19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.

21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.

25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.

26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International