Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

యోబు 6:1-2

యోబు ఎలీఫజుకు జవాబిచ్చుట

1-2 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

“నా శ్రమే గనుక తూచబడితే,
    నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,

యోబు 7

యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంఘర్షణ ఉంది.
    అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.
ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి.
    జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.
అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడుతోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి.
    శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.
నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను,
    ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అని.
రాత్రి జరుగుతూనే ఉంటుంది.
    సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.
నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది.
    నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.

“నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి.
    నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.
దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో.
    నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.
నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు.
    నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.
ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది.
    అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.
10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు.
    అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.

11 “అందుచేత నేను మౌనంగా ఉండను.
    నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది.
    నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.
12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు?
    నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?
13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి
    నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి
14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతున్నావు.
    దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.
15 అందుచేత బ్రతకటం కంటె
    చంపబడటం నాకు మేలు.
16 నా బ్రదుకు నాకు అసహ్యం.
    నేను శాశ్వతంగా జీవించాలని కోరను
నన్ను ఒంటరిగా ఉండనివ్వు.
    నా జీవితానికి అర్థం శూన్యం.
17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి?
    మనిషికి నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి?
18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు,
    ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు?
19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు?
    ఒక క్షణమైన నీవు నన్ను ఒంటరిగా ఉండనియ్యవు?
20 మనుష్యులను గమనించువాడా,
    నేను పాపం చేశానంటావా, సరే, మరి నన్నేం చేయమంటావు?
దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు?
    నేను నీకు ఒక భారమై పోయానా?
21 నీవు నా తప్పిదాలు క్షమించి,
    నా పాపాలను ఎందుకు క్షమించకూడదు?
త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను.
    అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”

అపొస్తలుల కార్యములు 10:1-16

కొర్నేలీ పేతురును పిలిపించటం

10 కైసరియ అనే పట్టణంలో కొర్నేలీ అనే పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు, “ఇటలి” దళంలో శతాధిపతిగా[a] పని చేస్తూ ఉండేవాడు. అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్థించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత అతణ్ణి సమీపించి, “కొర్నేలీ!” అని పిలిచాడు.

కొర్నేలీ అతని వైపు చూసి భయంతో, “ఏమిటి ప్రభూ!” అని అడిగాడు.

ఆ దేవదూత కొర్నేలీతో, “నీ ప్రార్థనలు, పేదవాళ్ళకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు. ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు. అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని యిల్లు సముద్రము తీరాన ఉంది” అని అన్నాడు. ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. ఈ భటుడు దైవభక్తి కలవాడు. జరిగినదంతా వాళ్ళకు చెప్పి వాళ్ళను యొప్పేకు పంపాడు.

మరుసటి రోజు వాళ్ళు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. అదే సమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళాడు. 10 పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకొన్నాడు. అతని కోసం ఇంటివారు వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది. 11 ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది. 12 అందులో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి. 13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.

14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు.

15 ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసినవాటిని అపవిత్రం అనకు” అని అన్నది. 16 ఇలా మూడు సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది.

యోహాను 7:1-13

యేసు మరియు ఆయన సోదరులు

ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు. యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది. యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు. నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు. అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!

యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే. ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు. ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.

10 ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా. 11 అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు.

12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు. 13 యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International