Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 70-71

సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.

70 దేవా, నన్ను రక్షించుము.
    దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారిని నిరాశపరచుము.
    వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
    వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
మనుష్యులు నన్ను హేళన చేసారు.
    వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.

నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
    ఆలస్యం చేయవద్దు!

71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
    నా మాట వినుము. నన్ను రక్షించుము.
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
    నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
    నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
    నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
    నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను.
    ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
కనుక నేను ముసలివాడినని నన్ను త్రోసివేయకుము.
    నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము.
10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు.
    ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు.
11 “దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి.
    అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు.
12 దేవా, నన్ను విడిచిపెట్టకుము.
    దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము.
13 నా శత్రువులను ఓడించుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు.
    వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ.
14 అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను.
    నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను.
    నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను.
    లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
16 యెహోవా, నా ప్రభూ, నీ గొప్పతనాన్ని గూర్చి నేను చెబుతాను.
    నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను.
17 దేవా, నేను చిన్నవానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు.
    నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబుతూనే ఉన్నాను.
18 దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు.
    నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి క్రొత్త తరానికీ నేను చెబుతాను.
19 దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది.
    దేవా, నీవంటి దేవుడు మరొకడు లేడు.
    నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు.
20 నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు.
    కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు.
    భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు.
21 ఇదివరకటి కంటె గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము.
    నన్ను ఆదరిస్తూనే ఉండుము.
22     స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను.
    నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను.
23 నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది.
    నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను.
24 అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది.
    నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు.

కీర్తనలు. 74

ఆసాపు ధ్యాన గీతం.

74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
    నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
    నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
    శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.

శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
    యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
    నరికే మనుష్యుల్లా ఉన్నారు.
ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
    నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
    వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
    ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
    దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
    ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
    ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
    నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
    నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
    నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
    దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
    మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
    సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
    వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
    ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
    నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
    ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
    వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
    నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
    ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
    ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.

న్యాయాధిపతులు 4:4-23

దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”

అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు.

“ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది.

కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. 10 కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.

11 కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.

12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 13 కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.

14 అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. 15 బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 16 బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.

17 కానీ సీసెరా పారిపోయాడు. యాయేలు అను స్త్రీ నివసిస్తున్న గుడారం దగ్గరకు అతడు వచ్చాడు. యాయేలు హెబెరు అనువాని భార్య. అతడు కెనితీ ప్రజల్లో ఒకడు. హెబెరు కుటుంబం హసోరు రాజగు యాబీనుతో సమాధానంగా ఉంది. కనుక సీసెరా యాయేలు గుడారానికి పరుగెత్తాడు. 18 సీసెరా రావటం యాయేలు చూసింది గనుక అతనిని కలుసుకొనేందుకు ఆమె బయటకు వెళ్లింది. యాయేలు, “అయ్యా, నా గుడారంలోనికి రండి. రండి, భయపడవద్దు” అని సీసెరాతో చెప్పింది. కనుక సీసెరా, యాయేలు గుడారంలోనికి వెళ్లాడు. ఆమె అతనిని గొంగళితో కప్పింది.

19 “నాకు దాహంగా వుంది. దయచేసి తాగేందుకు నాకు కొంచెం నీళ్లు ఇవ్వు” అన్నాడు సీసెరా యాయేలుతో. జంతు చర్మంతో చేయబడిన ఒక బుడ్డి యాయేలు దగ్గర ఉంది. అందులో ఆమె పాలు పోసి ఉంచింది. సీసెరా తాగటానికి యాయేలు ఆ పాలు ఇచ్చింది. అప్పుడు ఆమె సీసెరాను కప్పివేసింది.

20 అప్పుడు సీసెరా యాయేలుతో, “వెళ్లి, గుడార ద్వారం దగ్గర నిలువబడు. ఎవరైనా అటువైపు వచ్చి, ‘లోపల ఎవరైనా ఉన్నారా?’ అని అడిగితే ‘లేరు’ అని చెప్పు” అన్నాడు.

21 కానీ యాయేలు ఒక గుడారపు మేకును, ఒక సుత్తెను చూసింది. యాయేలు త్వరగా సీసెరా దగ్గరకు వెళ్లింది. సీసెరా చాలా అలసిపోయినందువల్ల, నిద్రపోతున్నాడు. యాయేలు గుడారపు మేకును సీసెరా కణతల మీద పెట్టి, సుత్తెతో దిగ గొట్టేసింది. ఆ గుడారపు మేకు సీసెరా కణతల్లో నుండి నేల మీదికి దిగిపోయింది. సీసెరా మరణించాడు.

22 సరిగ్గా అప్పుడే సీసెరా కోసం వెదుక్కొంటూ బారాకు యాయేలు గుడారంవైపు వచ్చాడు. యాయేలు బారాకును కులుసుకొనేందుకు బయటకు వెళ్లి, “ఇక్కడ లోపలికి రా, నీవు వెదుకుతున్న మనిషిని నేను నీకు చూపిస్తాను” అంది. కనుక బారాకు యాయేలుతో కలిసి గుడారంలో ప్రవేశించాడు. అక్కడ కణతల్లో నుండి నేలమీదికి గుడారపు మేకు దిగిపోయి, చచ్చిపడి ఉన్న సీసెరా బారాకుకు కనిపించాడు.

23 ఆ రోజు కనాను రాజు యాబీనును ఇశ్రాయేలు ప్రజలకోసం దేవుడు ఓడించాడు.

అపొస్తలుల కార్యములు 1:15-26

15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”

18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”

20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

‘అతని భూమిని పాడు పడనిమ్ము
    అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)

‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)

21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”

23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.

మత్తయి 27:55-66

55 చాలా మంది స్త్రీలు కొంత దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు ఉపచారాలు చెయ్యటానికి గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చినవాళ్ళు. 56 వాళ్ళలో మగ్దలేనే గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.

యేసును సమాధి చేయటం

(మార్కు 15:42-47; లూకా 23:50-56; యోహాను 19:38-42)

57 సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధనవంతుడు అరిమతయియ గ్రామం నుండి వచ్చాడు. యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు. 58 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో చుట్టాడు. 60 ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి వెళ్ళిపొయాడు. 61 మగ్దలేనే మరియ, యింకొక మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని ఉన్నారు.

సమాధిని కాపలా కాయటం

62 అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశమయ్యారు, 63 “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా ‘మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను’ అని అనటం మాకు జ్ఞాపకం ఉంది. 64 అందువల్ల మూడవ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, ‘అతడు బ్రతికాడు’ అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు.

65 పిలాతు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత” అని చెప్పాడు. 66 వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International