Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 77:1-2

సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.

77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
    దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
    రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
    నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.

కీర్తనలు. 77:11-20

11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
    ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
    దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
    నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
    యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
    లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
    ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
    అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
    మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
    భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
    కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
    మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.

1 రాజులు 22:29-40

రామోతు గిలాదు వద్ద యుద్ధం

29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది. 30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.

31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. 32 యుద్దం సాగుతూవుండగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు. 33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.

34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.

35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు. 36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.

37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. 38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.

39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది. 40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.

1 రాజులు 22:51-53

ఇశ్రాయేలు రాజుగా అహజ్యా

51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు. 52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు. 53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతో వున్నాడు.

2 కొరింథీయులకు 13:5-10

మీరు నిజమైన “విశ్వాసులా, కాదా” అని తెలుసుకోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం మీరు గ్రహిస్తారని నమ్ముతున్నాను. మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్లు ప్రజలు గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము సత్యానికి విరుద్ధంగా ఏదీ చెయ్యలేము. అన్నీ సత్యంకొరకే చేస్తాము. మీరు బలంగా ఉంటే, మేము బలహీనంగా ఉండటానికి సంతోషిస్తాం. మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము ప్రార్థిస్తున్నాము. 10 అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి కాదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International