Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 19:1-4

సీనాయి పర్వతంపై ఏలీయా

19 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు. అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”

ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”

1 రాజులు 19:5-7

ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.

యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు.

1 రాజులు 19:8-15

అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు.

అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.

10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”

11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.

13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.

14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”

15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు.

కీర్తనలు. 42

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

కీర్తనలు. 43

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

గలతీయులకు 3:23-29

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము. 24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది. 25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు. 27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు. 28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని వ్యత్యాసం లేదు. క్రీస్తు యేసులో మీరందరు సమానం. 29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

లూకా 8:26-39

యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం

(మత్తయి 8:28-34; మార్కు 5:1-20)

26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. 27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.

28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.

30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు.

అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. 31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. 32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.

34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. 36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు.

అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు. 39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు.

అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International