Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 59

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.

59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
    నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
    నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
    నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
    యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
    లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.

ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
    వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
    వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
    వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.

యెహోవా, వారిని చూసి నవ్వుము.
    ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
    దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
    నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
    నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
    వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
    వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
    వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
    దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.

14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
    మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
    వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
    ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
    కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
    ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
    నీవు నన్ను ప్రేమించే దేవుడవు.

2 రాజులు 9:14-26

యెహూ యెజ్రెయేలుకు వెళ్లుట

14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు.

ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు. 15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు.

అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించినట్లయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పించుకొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో చెప్పకూడదు” అని పలికాడు.

16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తన రథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.

17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు.

“వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.

18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు.

“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు.

“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.

19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు.

“నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.

20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తిరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారుడు యెహోరాముతో అన్నాడు.

21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు.

అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.

22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు.

“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును?” అన్నాడు.

23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అని చెప్పి, పారిపోవుచు ఉండెను.

24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.

25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు. 26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”

ఎఫెసీయులకు 2:11-22

మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము

11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.

14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.

19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International