Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 21:8-21

ఇంట్లో సమస్య

ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. గతంలో ఈజిప్టు బానిస స్త్రీయైన హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా అబ్రాహామే తండ్రి. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. 10 కనుక “ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు” అంటూ శారా అబ్రాహాముతో చెప్పింది.

11 ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. 12 కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. 13 అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడూ నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”

14 మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రాహాము వాటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వాటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.

15 కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. త్రాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. 16 హాగరు కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.

17 ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. 18 వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.”

19 అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్లు చేశాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి, తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు త్రాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.

20 ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. 21 అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.

కీర్తనలు. 86:1-10

దావీదు ప్రార్థన.

86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
    యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
    నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
    నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
    రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
    నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
    సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
    నా ప్రార్థనలు ఆలకించుము.
యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
    నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
దేవా, నీవంటివారు మరొకరు లేరు.
    నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
    వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
    నీవు మాత్రమే దేవుడవు.

కీర్తనలు. 86:16-17

16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
    నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
    నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
    అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
    ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

రోమీయులకు 6:1-11

పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము

దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.

మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.

మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

మత్తయి 10:24-39

24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!

దేవునికి భయపడుము, జనులకు కాదు

(లూకా 12:2-7)

26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.

28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.

నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు

(లూకా 12:8-9)

32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. 33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.

యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును

(లూకా 12:51-53; 14:26-27)

34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,

‘తండ్రి కుమార్ల మధ్య,
    తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
    విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)

37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International