Revised Common Lectionary (Semicontinuous)
దావీదు ప్రార్థన.
86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
2 యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
3 నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
4 ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
5 ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
6 యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
నా ప్రార్థనలు ఆలకించుము.
7 యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
8 దేవా, నీవంటివారు మరొకరు లేరు.
నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
9 ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
నీవు మాత్రమే దేవుడవు.
43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. 44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. 45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. 48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. 49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”
యేసు మానవజన్మనెత్తటం
5 మనం మాట్లాడుతున్న ప్రపంచాన్ని, అంటే రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ లేదు. 6 ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది:
“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు?
మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ స్థానాన్ని యిచ్చావు!
మహిమ, గౌరవమనే కిరీటాన్ని నీవతనికి తొడిగించి,
8 అన్నిటినీ అతని పాదాల క్రింద ఉంచావు.”(A)
దేవుడు అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. 9 యేసు, దేవదూతల కన్నా కొంత తక్కువవానిగా చేయబడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణించాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి మరణించటంవలన “మహిమ, గౌరవము” అనే కిరీటాన్ని ధరించగలిగాడు.
© 1997 Bible League International